బీజేపీ ఎమ్మెల్యేకి చుక్కలు చూపెడ్తున్న.. మిస్ ప్రేమకుమారి!

”నా పేరు ప్రేమకుమారి.. మీ సారుకి మాజీ ప్రియురాల్ని.. పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని కూడా..”. ఇదీ వరస. మైసూర్ కృష్ణరాజ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ఏ రామదాస్ ఇంటి దగ్గరకొచ్చి ప్రేమకుమారి అనే ఆవిడ చేసే హల్చల్ ఇప్పుడు కర్ణాటక మొత్తాన్నీ ఊపేస్తోంది. ఎమ్మెల్యే గారు లేరమ్మా.. రేపు రండి.. అంటూ నచ్చజెప్పజూసినా ఆమె వినకపోగా.. జబర్దస్త్ డైలాగులతో వీరంగం సృష్టించింది. ఆయన్ను కలిశాకే ఇక్కడ్నుంచి కదులుతానంటూ అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంది మిస్ ప్రేమకుమారి. నిజానికి.. ఆమె చెప్పిందాంట్లో అర్ధణా వంతు అబద్ధం కూడా లేదు. గత నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సీజన్లోకి ఒక్కసారి లుక్కేస్తే.. వీళ్ళ ఎపిసోడ్ కనిపిస్తుంది.

అప్పట్లో బీజేపీ నేత రామదాస్.. టిక్కెట్ సంపాదించి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సమయంలో.. ఇలాగే ఆయన్ను వెంటాడింది ప్రేమకుమారి. ఫ్లాష్‌బ్యాక్‌లో నువ్వూనేనూ కలిసి తిరిగిన మాట వాస్తవం కాదా.. అంటూ అతడి ఇమేజ్ మీద దాడి షురూ చేసిందామె. అతడు ససేమిరా అనడంతో.. నీకు పోటీగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ నామినేషన్ కూడా వేసింది. అసలుకే ఎసరొచ్చేలా వుందని బెంబేలెత్తిపోయిన మిస్టర్ రాందాస్.. ఆమెకు 5 కోట్లు ముట్టజెప్పి.. పోటీ నుంచి విరమింపజేశారు. అక్కడితో కథ అయిపోయిందనుకుని ఊపిరి పీల్చుకున్న ఎమ్మెల్యే గారికి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ చూపిస్తోంది ప్రేమకుమారి అనే ఆ ముదురావిడ. ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరి రొమాంటిక్ క్రైం థ్రిల్లర్.. కన్నడ వార్తల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.