దేశంలో ఇప్పటివరకు డ్రోన్ల గురించిన ప్రచారం పెద్దగా జరగలేదు. విదేశాల్లో పాపులరవుతున్న డ్రోన్లు మన దేశంలో మాత్రం ఇంకా ‘నత్తనడకన’ సాగుతున్నాయి . అక్కడక్కడా ఒకటీ..అరా వీటిని వినియోగించిన సందర్భాలున్నా.. ప్రజలకు వీటిపై అవగాహన దాదాపు శూన్యమే..అందువల్లే డ్రోన్లకు ప్రాధాన్యమిస్తూ తాము ‘డ్రోన్ పాలసీ’ని ప్రకటిస్తున్నామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆ మధ్య వెల్లడించారు. వీటిని కమర్షియల్‌గా వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసరంగా ప్రాణరక్షణ మందులను, దాత లిచ్చిన అవయవాలను చేరవేసేందుకు ఇక డ్రోన్లను వినియోగించుకునే అవకాశాలున్నాయి. మారు మూల ప్రాంతాలకు వీటిని ఇతర వాహనాల ద్వారా చేరవేయడం కష్ట సాధ్యం గనుక.. డ్రోన్లపైనే ఆధారపడక తప్పదు.


జొమాటో, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉత్పత్తుల డెలివరీకి వీటిని వినియోగించుకునేందుకు ఆరాట పడుతున్నాయి. ఉబేర్ సంస్థ తమ ఆహార పదార్థాలను డ్రోన్ల ద్వారా డెలివరీ చేస్తామని గత ఏడాది ప్రకటించింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదు. వచ్చే 5 నుంచి 10 ఏళ్ళలో డ్రోన్ పరిశ్రమను 1980 నాటి కంప్యూటర్ ఇండస్ట్రీతో పోల్చవచ్చునని బెంగుళూరులోని స్కై లార్క్ డ్రోన్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముగిలన్ రామసామి అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో డ్రోన్ల పరిశ్రమ ఇంకా ఓ హాబీ గానే ఉందని పేర్కొన్న ఆయన..ఈ పరిశ్రమకు సంబంధించి నిబంధనలను, మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రవేశపెడితే అప్పుడు అది బిజినెస్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. తాము వీటిని అమ్మబోమని, అయితే సేవా రంగానికి ఉపయోగపడేలా చూస్తామని ఆయన చెప్పారు. లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ రోడ్ సర్వేలకు, టాటా స్టీల్ కంపెనీ మైనింగ్‌కి, వ్యవసాయ సంబంధ సర్వేలకు డ్రోన్లను వినియోగించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *