బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ పుస్తక ప్రపంచంలాంటి బుక్ షాప్ కనిపిస్తుంది. అది ఆషామాషీ షాప్ కాదు. అన్ని ప్రాంతీయ భాషల పుస్తకాలూ అక్కడ దర్శనమిస్తాయి. దీనికే ‘ అట్టా..గలాట్టా ‘ అనే తమాషా పేరుంది. సాధారణ బుక్స్‌తో బాటు డిజిటలైజ్ చేసిన గ్రంథాలూ ఇక్కడ ఉండడం విశేషం. 2012లో లక్ష్మి, సుబోద్ శంకర్ అనే వ్యక్తులు ఓ చిన్న స్టోర్ రూమ్‌లో దీన్ని ప్రారంభించారు. అది ఈ నాటికి అతి పెద్ద బుక్‌షాప్‌గా రూపు దిద్దుకుంది.

తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం వంటి అనేక భాషా గ్రంథాలను ఇక్కడ చూడవచ్చు. అట్టా అంటే కన్నడలో ‘ ఆట ‘ అని, గలాట్టా అంటే ‘ తమాషా ‘ అని అర్థమట..అంటే.. తమ షాపును విజిట్ చేసేవారు ఇక్కడ కేవలం బుక్ రీడింగే కాక, ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎంజాయ్ చేయవచ్చునంటున్నారు దీని నిర్వాహకులు.

ప్రీమ్ చంద్ రాసిన క్లాసిక్ నవలల నుంచి తమిళ రైటర్లు రాసిన ఎన్నో పుస్తకాలు తమ షాప్ లో అందుబాటులో ఉంటాయని లక్ష్మి చెబుతున్నారు. ఈ షాప్ కేవలం లైబ్రరీలా ఉపయోగపడడమే కాదు.. వర్క్ షాపులు, సాహితీ సదస్సులు, స్టోరీ టెల్లింగ్ సెషన్స్ , ఇతర ఈవెంట్స్ ను కూడా ఇది నిర్వహిస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎంతోమంది రచయితలు , కాలేజీ విద్యార్థులు ఈ బుక్ షాప్ ను రెగ్యులర్ గా సందర్శిస్తుంటారు.

నిజానికి ఇది తనకు ఓ వెరైటీ ‘ కాఫీ ‘ షాప్ లాంటిదని, ఒక్కోసారి ఇక్కడకు వచ్చి తాను ఆధ్యాత్మిక ధోరణిలోకి వెళ్లిపోతుంటానని నందితా బోస్ అనే రచయిత్రి చెప్పారు. ఇదో విజ్ఞాన ఖని అని ఆమె అభివర్ణించారు. 2016 లో ఈ బుక్ షాప్ పబ్లిషింగ్ హౌస్ గా కూడా మారింది. అప్పటినుంచి ఎన్నో పుస్తకాలను ప్రచురిస్తూ వస్తోంది. కర్ణాటకలో 30 మంది యువ కవులు రాసిన ఓ కవితా సంకలనాన్ని ప్రచురిస్తే,,అది అనేకమంది ఆదరణను చూరగొందట..ఈ-మ్యాగజైన్స్ సైతం ఈ అట్టా గలాట్టా లో ఉన్నాయని. రీడర్లు చాలామంది వీటిని చదివేందుకు మక్కువ చూపుతున్నారని లక్ష్మి, సుబోద్ శంకర్ అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *