‘అధ్యక్షా’ అంటూ సభ్యుల చేత మర్యాదలందుకునే గౌరవప్రదమైనది అసెంబ్లీ స్పీకర్ కుర్చీ. సభలో అన్‌పార్లమెంటరీ భాష వాడితే ఉన్నపళంగా విచక్షణా రహితంగా రికార్డుల నుంచి తొలగించే హక్కు కూడా ఆ స్పీకర్ గారిదే. కానీ.. అటువంటి గౌరవనీయులైన సభాపతివర్యుల నోరే మున్సిపాలిటీ అయితే..! ఆయన నోరు విప్పినప్పుడల్లా అన్‌పార్లమెంటరీ పదాలే దొర్లితే..? ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి..?

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ నోటి ముత్యాలు ఇప్పుడు దేశమంతా రచ్చ పుట్టిస్తున్నాయి. ”నాకో పెళ్ళాం వుంది.. వేరే మగాళ్లతో పడుకోవాల్సిన అవసరం నాకు లేదు..” అంటూ ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది కర్ణాటక. కాంగ్రెస్ పార్టీకే చెందిన సహచర నేత కెహెచ్ మునియప్ప కామెంట్‌కి కౌంటర్ ఇవ్వబోయి ఆయన ఇలా సెలవిచ్చారు. ”మాకూ మాకూ గొడవలేమీ లేవు. నియోజకవర్గంలో భార్యాభర్తల్లా కలిసి పని చేసుకుంటాం..” అంటూ మునియప్ప ఒక సందర్భంలో అన్నందుకు ఈ పెద్దమనిషి ఇలా స్పందించారు.

”నాకు చట్టబద్ధంగా భార్య వుంది. మరి.. వేరే మగాళ్లతో నాకేం పని..? ఆయనకు అటువంటి ఆసక్తి ఉందేమో అడగండి” అన్నారు స్పీకర్ రమేష్ కుమార్. కోలార్ ఎంపీ టిక్కెట్ గురించి పోటీ పడే క్రమంలో వీరిద్దరూ ఇలా ‘మోటు సరసం’ ఆడి రోడ్డుకెక్కేశారు. గతంలో కూడా.. స్పీకర్ రమేశ్ కుమార్ ఇటువంటి అనేక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ కమల’ ఆడియో టేపుల వ్యవహారంలో ‘నేను మానభంగానికి గురయ్యాను’ అంటూ తనమీద తానే సీరియస్ సెటైర్ వేసుకుని మీడియాలో ‘గబ్బయ్యారు’ ఈ సభాపతి. ‘ఏమిటిది అధ్యక్షా?’ అంటూ అందరూ నోరెళ్లబెట్టేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *