ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు. అలాగే… కార్యాలయాన్ని చూసి ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చన్నది మరో మాట. పనిచేసే వాతావరణాన్ని బట్టి.. అక్కడి పనివాళ్ల ప్రొడక్టివిటీ మారుతుందని ఒక నిఖార్సయిన అంచనా వుంది. డెస్క్ మీద కూర్చుని ఏ పని చేద్దామన్నా ఏకాగ్రత కుదరలేదంటే.. అది ఒక్కోసారి నీ తప్పు కాకపోవచ్చు. అక్కడి పరిసరాలే నీలోని గజిబిజికి అసలైన కారణం కావొచ్చు. ఈ విషయాన్ని గుర్తించబట్టే HR విభాగంలో ‘ఆఫీస్ అట్మాస్పియర్’ అనే సబ్జెక్ట్ మీద నిరంతర కసరత్తు జరుగుతుంది. అలా ఏర్పాటయ్యే కొన్ని కృత్రిమ వాతావరణాలు.. ఒక్కోసారి అడ్డం తిరిగే ప్రమాదం కూడా ఉందట. ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ తగ్గి.. అసలుకే మోసం వచ్చే కొన్ని రకాల కృత్రిమ ఆఫీస్ డిజైన్లను జాబితా కట్టిందొక సంస్థ.

అమెరికాలాంటి కొన్ని దేశాల్లో 90 శాతం మంది ఉద్యోగులు ఇండోర్‌లోనే కూర్చుని పని చేస్తారు. నాలుగు గోడల మధ్యే ఎక్కువ సమయం గడపాల్సి రావడం వల్ల.. వాళ్ళు పీల్చే గాలిలో స్వచ్ఛత కొరవడుతోంది. వెంటిలేషన్ సమస్యల కారణంగా సహజసిద్ధమైన శ్వాసకు నోచుకోలేరు. అందుకే.. యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం.. స్వచ్ఛమైన గాలి లేని కారణంగా 30 శాతం ఎంప్లాయీ పెర్ఫామెన్స్‌ తగ్గిపోతోందని తేలింది. వీళ్ళు ప్రయోగాత్మకంగా తయారుచేయించిన గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్స్‌లో పనిచేసినవారి పెర్ఫామెన్స్‌లో 26 శాతం స్పష్టమైన మెరుగు కనిపించిందట.

సూర్యరశ్మి నేరుగా తగిలే చోట పనిచేయడం కూడా ఒక్కోసారి కీలక మార్పుల్ని చూపిస్తుంది. ‘ఫ్యూచర్ వర్క్ ప్లేస్’ అనే సంస్థ విప్లవాత్మకంగా ‘మేడ మీద డ్యూటీ’ అనే ఎక్స్‌పరిమెంట్ చేసింది. కాఫీ షాపులు, ఫిట్నెస్ సెంటర్, చైల్డ్ కేర్ సెంటర్ల లాంటివి బిల్డింగ్ ఓపెన్ టాప్స్ మీద ఏర్పాటు చేసి.. అక్కడ మంచి ప్రొడక్టివిటీ రాబట్టుకున్నారు. లైటింగ్ వ్యవస్థతో వచ్చే వెలుతురు కంటే సహజమైన వెలుతురులోనే నూతనోత్తేజం కలుగుతుందట. రూమ్ టెంపరేచర్స్ విషయంలో కూడా ఉద్యోగుల్లో స్పర్ధలొచ్చే అవకాశం వుంది. వారివారి ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్లు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఉండాలట. న్యాచురల్ గ్రీనరీ.. దానిద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలి.. ఉద్యోగుల అటెన్షన్, రెస్టోరేషన్ థియరీని ప్రభావితం చేస్తుంది. పని ఒత్తిళ్లను తగ్గించే అవకాశం కూడా వుంది.

ఎవరితో కూర్చుని పని చేస్తున్నాం.. అనేది కూడా ప్రాధాన్యతాంశమే. మనుషుల్ని ‘సోషల్ ఎనిమల్స్’గా చెప్పుకుంటాం. మన చుట్టూ వుండేవాళ్ళను చూసి, వాళ్ళ ఉద్దేశాల్ని, వాళ్ళ అభిప్రాయాలని మనమీద రుద్దేసుకోవడం సహజం. కొన్నాళ్ళు కలిసి తిరిగితే వాడు వీడవుతాడన్న నానుడి ఉండనే వుంది. అందుకే.. కొలీగ్స్ విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. సరిగ్గా ఇదే అంశం మీద 2000 మంది టెక్కీల మీద రీసెర్చ్ చేసింది హార్వర్డ్ బిజినెస్ స్కూల్. బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళకు 25 అడుగుల దగ్గరగా మెలిగే వాళ్ళు కూడా ‘బాగా పనిచేయడం’ అలవాటు చేసుకున్నట్లు తేలింది. ఎవరి సీట్లు ఎవరి పక్కన ఏర్పాటు చేయాలనేది కూడా HR డిపార్ట్ మెంట్ ఒక డ్యూటీగా భావిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *