వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆస్తుల విలువ రూ.375 కోట్లు. ఈ ఆస్తులన్నీ ఆయన పేరిటే వున్నాయి. అదే ఫ్యామిలీ సభ్యులతో కలిపితే ఆస్తుల విలువ అక్షరాలా 510 కోట్ల రూపాయలు. శుక్రవారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా జగన్ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్‌తోపాటు తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు, అప్పులు, పెట్టుబడులు, కేసుల వివరాలతో కూడిన 47 పేజీల అఫిడవిట్‌ను సమర్పించారు. ఈనెల 19 నాటికి తన చేతిలో-43 వేలు, భార్య వద్ద- 49 వేలు, హర్షారెడ్డి- 1000 రూపాయలు, వర్షారెడ్డి- 7 వేలు మాత్రమే వున్నట్లు తెలిపారు. తన పేరిట ఎలాంటి బంగారు ఆభరణాలు లేవన్న జగన్‌.. భారతి పేరిట 3 కోట్ల 57 లక్షలున్నట్లు తెలియజేశారు. ఫ్యామిలీ సభ్యుల పేరిట ఎలాంటి వాహనాలు లేవన్నారు. కానీ హోం మంత్రిత్వశాఖ నియమించిన దృష్ట్యా నాలుగు బుల్లెట్ ఫ్రూఫ్ కార్లను జగన్ పేరిట రిజిస్టర్ చేశారు. ఇందులో ఒక BMW X5, మూడు మహీంద్రా స్కార్పియోలున్నాయి. తనపై 31 కేసులున్నట్లు వెల్లడించిన జగన్, 11 సీబీఐ, 7 ఈడీ కేసులున్నాయి.

బెంగళూరులోని ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌లో రూ.20,20,083, అక్కడే మరో ఖాతాలో రూ.1,25,32,855, హైదరాబాద్‌ సచివాలయం ఎస్‌బీఐలో రూ.21,44,746 డిపాజిట్లు వున్నాయని, మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.25 వేలు వున్నట్లు వివరించారు. భారతి పేరిట బెంగుళూరులోని యాక్సిస్ బ్యాంక్‌లో 9 లక్షలు, మరో ఖాతాలో 17 లక్షలున్నాయి. కోరమంగళ ప్రాంతంలో ఓబీసీ బ్యాంక్‌లో 5 లక్షల 73 వేలు, మరో ఖాతాలో 20 లక్షల 90 వేలు, ఇంకో ఖాతాలో 8 లక్షలు పైనే వున్నట్లు తెలిపారు. పులివెందుల ఎస్బీఐలో 21 లక్షలు పేర్కొన్నారు.

 

ఇక స్థిరాస్తుల విషయంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌, బెంగళూరులోని ఇళ్లకు సంబంధించిన వివరాలను ప్రస్తావించలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇంటికి సంబంధించిన వివరాలను మాత్రం అఫిడవిట్‌లో తెలిపారు. రూ.1,19,21,202 అప్పులు చూపించారు. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.5,80,584 అని చూపారు. ఇవేగాక వివాదంలోవున్న అప్పులు రూ.66 కోట్లు, భార్య పేరిట రూ.6.75కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

జగన్‌ పేరిట ఇడుపులపాయలో రూ.42.44లక్షల విలువ 42.44 ఎకరాల భూమి వుంది. వ్యవసాయేతర భూమి కింద పులివెందుల మండలం భాకరాపురంలో రెండు వేర్వేరు సర్వేనెంబర్లలో రూ.8,42,39,232 విలువ కలిగిన 4,51,282 చ. గజాల స్థలం చూపించారు. బంజారాహిల్స్‌ రోడ్‌నెం.2 లో రూ.14,46,33,560 విలువ కమర్షియల్ భవనం వుండగా, సాగర్‌సొసైటీలో, పులివెందుల మండలంలోని భాకరాపురంలో రూ.11,99,59,582 విలువ భవనాలున్నాయి. కూతురు వర్షారెడ్డికి పాన్ కార్డు లేదని ఆదాయపన్ను చెల్లింపులేమీ జరగలేదని చూపించారు. మరో కూతురు హర్షారెడ్డికి సంబంధించి 2017-18 ఏడాదికి ఆదాయం 8 లక్షల 68 వేలుగా చూపించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *