టీడీపీ-జనసేనల మధ్య బంధం వుందో లేదో తెలీదు. కానీ.. వాళ్ళ బంధం మరింత బలపడుతోందన్న వెర్షన్‌ని మాత్రం ప్రధాన ప్రతిపక్షం వైసీపీ జనంలోకి బాగా తీసుకెళ్తోంది. గురువారం గాజువాకలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్.. అక్కడి జనాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం వైసీపీ క్యాంప్‌ను మరింత అప్రమత్తం చేసింది. ”ప్రధాన ప్రతిపక్ష నాయకులు అవినీతి కేసుల్లో ఉంటూ మమ్మల్ని ఎలా ప్రశ్నిస్తారు..? జేడీ లక్ష్మీనారాయణని చూసి జగన్ బ్యాచ్ వణికిపోతోంది..” అంటూ పవన్ చేసిన కామెంట్స్ కి జగన్ తీవ్రంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా ‘చంద్రబాబు పార్టనర్’ అంటూ జగన్ సుదీర్ఘ విమర్శలు చేశారు.  కడప జిల్లాలో విస్తృతంగా పర్యటించిన జగన్.. తన ప్రసంగాల్లో ‘పవన్-చంద్రబాబు’ల రిలేషన్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ‘మమ్మల్ని కేసుల్లో ఇరికించినవారు ఇప్పుడు విశాఖపట్నంలో పోటీ చేస్తున్నారు.. ఆయనకు టిక్కెట్టిచ్చి బీఫారం మీద సంతకం పెట్టేది మాత్రం చంద్రబాబు పార్టనర్. ఖర్చులకు డబ్బులిచ్చేది చంద్రబాబే’నంటూ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను, పవన్ కళ్యాణ్‌ని కలిపి విమర్శించారు జగన్. ”గాజువాకలో పార్టనర్ నామినేషన్ వేస్తే అక్కడ కనిపించే మనుషులు, జెండాలు కూడా చంద్రబాబువే” అన్నారు జగన్.

రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నామని చెప్పే పవన్ కళ్యాణ్.. ఆ సమాన దూరాన్ని బ్యాలెన్స్ చేయడంలో తప్పటడుగులు వేస్తున్నారని, అందుకే ఆయన ఇలా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ ఆరోపణలకు దొరికిపోతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. తెలుగుదేశం, వైసీపీల్ని ఒకే మోతాదులో తిడుతూ ముందుకెళ్లడం అనేది పవన్‌కి కష్టసాధ్యంగా మారింది. మిగతా పార్టీల్ని తిట్టడం మాత్రమే రాజకీయంగా మారిన క్రమంలో పవన్ కూడా అదే పంథాను అనుసరించాల్సి వస్తోంది. జనానికి ఏం చేస్తామో చెప్పడం మానేసి.. ఆ రెండు పార్టీలని సమాన స్థాయిలో తిట్టుకుంటూ వెళ్ళడానికే ప్రయారిటీ ఇవ్వాల్సి రావడం పవన్‌కి ఒక ఇబ్బందికర పరిస్థితి. కన్వెన్షనల్ పాలిటిక్స్ వద్దువద్దంటూనే మళ్ళీమళ్ళీ ఆ మూస రాజకీయాలకే అలవాటుపడుతోంది జనసేన.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *