జిల్లా రాజకీయాల్ని మొత్తం శాసిస్తానంటూ జగన్ దగ్గర పంతం పట్టి ఒంగోలు ఎమ్మెల్యే టిక్కెట్ సాధించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి హైకమాండ్ నుంచి అక్షింతలు పడ్డాయట. మీడియా దగ్గర తన అసలు రంగు బైటపెట్టుకుంటున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో.. హైదరాబాద్ నుంచి పిలుపొచ్చినట్లు కూడా తెలుస్తోంది. ‘బెట్టింగ్ అలవాటు వుందటగా.. చాలా డబ్బు పోయిందటగా..’ అని అడిగితే.. ‘బెట్టింగ్ పెట్టిన మాట వాస్తవం. ఏవో కొన్ని లక్షలు పోయాయి అంతే..’ అని మీడియాముఖంగా ఒప్పుకున్నారాయన. పైగా.. ఎన్నికల్లో ‘ఖర్చు’ పెట్టడానికి తన దగ్గర కావాల్సినంత డబ్బు వుందని కూడా నోరు జారారు బాలినేని శ్రీనివాసరెడ్డి.

ఇదిలా ఉంటే.. బాలినేనికీ, జగన్ చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి గొడవలున్న విషయం ఇప్పుడు పార్టీ లోపలా బైటా చర్చకు తావిస్తోంది. బాలినేని ఫిర్యాదు కారణంగానే.. వైవీ సుబ్బారెడ్డి సిట్టింగ్ సీటును పీకి మాగుంట శ్రీనివాసులురెడ్డికిచ్చింది వైసీపీ హైకమాండ్. దీన్ని తలఒంపులుగా భావిస్తున్న వైవీ సుబ్బారెడ్డి కొన్నాళ్లుగా అజ్ఞాతంలో వున్నారు. తనకు ఇవ్వకపోయినా.. కుటుంబంలోనే మరొకరికి ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి పట్టుబట్టినప్పుడు ‘ఒంగోలు బరిలో షర్మిల’ అన్న వార్తలు కూడా వచ్చాయి.

బాలినేని మాట విని చిన్నాన్నను చెడ్డ చేసుకున్న జగన్.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఎన్నికల తర్వాత.. రాజ్యసభ సీటిస్తానన్న హామీతో చిన్నాన్నను జగనే విదేశాలకు పంపినట్లు జిల్లాలో చెప్పుకుంటున్నారు. కానీ.. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉంటానని, ప్రకాశం జిల్లాలో తన ఉనికి మీద తనకు విశ్వాసం ఉందని బహిరంగంగా చెబుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. బాలినేని ఓటమి కోసం వైవీ సుబ్బారెడ్డి స్కెచ్ వేశారన్న వార్తలు కూడా వైసీపీలో కాక పుట్టిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *