జగన్‌పై హత్యాయత్నం కేసు.. రాజకీయంగా పెనుదుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. ఘటనకు ముందు నిందితుడు శ్రీనివాసరావు రాసుకున్న 11 పేజీల సుదీర్ఘ ఉత్తరం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చేతిరాతల్లో మార్పులుండడం.. కంటెంట్‌లో తేడాలుండడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ లేఖ రాసిందెవరన్న మిస్టరీని కూడా సిట్ పోలీసులు ఛేదించలేకపోయారు. ఆ లేఖ తాలూకు సస్పెన్స్ కొనసాగుతుండగానే.. ‘కోడి కత్తి’ ఎపిసోడ్‌లో మరో ‘ఆటోబయోగ్రఫీ’ ఉదంతం ఉత్కంఠ రేపుతోంది.

రిమాండ్ సమయంలో తాను జైలు ఊచల వెనుక కూర్చుని ఒక పుస్తకం రాశానని, అందులో ‘దాడి’కి సంబంధించి కీలక అంశాల్ని ప్రస్తావించానని శ్రీనివాసరావు చెబుతున్నాడు. జగన్‌పై తాను ఎందుకు దాడి చేశానో ఆ పుస్తకంలో వివరించానంటున్న శ్రీనివాసరావు.. ఆ పుస్తకాన్ని జైలు అధికారులు లాక్కున్నారని, దాన్ని తనకిప్పించాలని వేడుకుంటున్నాడు. జైల్లో తమ క్లయింట్ రాసుకున్న పుస్తకాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటి అంటూ అతడి తరపు లాయర్ ప్రశ్నిస్తున్నారు.

ఇటు.. నిందితుడిని NIA దర్యాప్తు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించాలంటూ అతడు మేజిస్ట్రేట్‌ని వేడుకున్నాడట. ఇదే మాటలు గతంలో పోలీస్ జీపులో కూర్చుని మీడియాతో కూడా చెప్పాడితడు. ఇంతకీ అతడు ప్రజలకు చెప్పదల్చుకున్న అంశాలేమిటి? తన చర్యను రాజకీయం చేయవద్దంటూ వేడుకుంటున్న శ్రీనివాసరావు.. మరెలాంటి బ్రేకింగ్ న్యూస్ జనంతో పంచుకోవాలనుకుంటున్నాడు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటు.. కోడికత్తి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకోవడంతో.. గుట్టు బైటపడుతుందన్న ఆందోళన చంద్రబాబులో మొదలైందని, అందుకే దావోస్ పర్యటన కూడా రద్దు చేసుకున్నారని ఒక వర్గం మీడియా రాసేస్తోంది. ఏపీ పోలీసుల నుంచి దర్యాప్తు పగ్గాలు లాక్కున్న కేంద్రంపై కన్నెర్ర చేస్తూ చంద్రబాబు లేఖ రాసినప్పుడే ఆయనలో ‘ఎందుకీ ఉలికిపాటు’ అంటూ ఆరా తీయడం మొదలైంది. ఏపీ పోలీసులు NIA దర్యాప్తునకు సహకరించడం లేదని, తమ దగ్గరున్న ఆధారాలు సమర్పించడం లేదని వార్తలొస్తున్నాయి. నిందితుడు జగన్ అభిమాని అని ఒక వర్గం వాదిస్తుంటే.. తెలుగుదేశం ఏర్పాటు చేసిన ‘కిరాయి అభిమాని’ అంటూ వైసీపీ దబాయిస్తోంది.

ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీలో వున్నాడని అధికారులు చెబుతున్నారు. రెండుమూడురోజుల్లో కొంతమంది అరెస్ట్ ఖాయమన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని టీడీపీ తలకాయలు NIA రాడార్లో చేరిపోయారట. ఈ జంట దర్యాప్తుల గొడవ చివరకు ఏ మలుపు తీసుకుంటుంది..? ఎవ్వరిని బోనులో నిలబెడుతుంది? కొత్తగా ఇతగాడు రాసుకున్న ‘కోడి కత్తి పుస్తకం’లో ఏముంది? అనేది సస్పెన్స్. రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతిష్టకు సంబంధించిన ‘కోడి కత్తి’ కేసు క్లయిమాక్స్‌పై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతూనే వుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *