తెలంగాణలో కాంగ్రెస్ కంచుకోటలు బద్దలవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతి పక్షనేత జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య దాదాపు 9,516 మెజార్టీతో గెలిచారు. దీంతో జానారెడ్డి విజయాలకు బ్రేక్ పడింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం జానారెడ్డి కోట. 1983లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అప్పటినుంచి 1994లో మినహా.. ఏడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువకాలం మంత్రిగా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ప్రతి ఎన్నికల్లోనూ జానారెడ్డి చివరి పదిరోజులే ప్రచారం చేస్తారని ఆయన వర్గీయులు చెబుతుంటారు. మిగిలిన రోజుల్లో ఆయన ప్రధాన అనుచరులే ప్రచార బాధ్యతలను నెత్తినేసుకుంటారు. జానారెడ్డి ఎత్తులను పసిగట్టిన టీఆర్ఎస్.. జానారెడ్డి వర్గీయులను తమవైపుకు తిప్పుకుంది. జానారెడ్డిని ఢీకొట్టడానికి టీఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య మరోమారు రంగంలోకి దింపింది. ఖరారు కాగానే సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ప్రచారం మొదలుపెట్టేశారు ఆయన. 1999, 2004లో ఉమ్మడి ఏపీలోని నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున గెలుపొందిన నర్సింహయ్య, విభజన నేపథ్యంలో 2014లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో జానారెడ్డిపై పోటీ చేసి 16 వేల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మళ్లీ జానారెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు నోముల.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *