వర్కవుట్ అయ్యే అన్ని అంశాలనూ వాడుకుంటూ.. ఏపీలో తెలుగుదేశం, వైసీపీ మూస రాజకీయాలతో చెలరేగిపోతుంటే.. జనసేనలో మాత్రం నిశ్శబ్ద యుద్ధం షురూ అవుతోంది. ఎన్నికల ప్రణాళిక మీద భీకరమైన కసరత్తు జరుగుతోందక్కడ. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను స్క్రీనింగ్ కమిటీకి అప్పగించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ప్రోగ్రెస్ కూడా సాధించినట్లు వార్తలొస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది.

విశాఖ జిల్లా గాజువాక మీద జనసేన అధినేత కన్నేశారన్నది తాజా ఊసు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని మరో సెగ్మెంట్‌ని కూడా పార్టీ నేతలు పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ.. గాజువాక వైపే పవన్ మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా గాజువాకలో పార్టీ సభ్యత్వాల సంఖ్య లక్ష మార్క్ దాటిందని.. ఇక్కడ పోటీ చేయడం ద్వారా.. పవన్ రికార్డ్ మెజారిటీతో నెగ్గడం ఖాయమని ఒక అంచనా బలపడిపోయింది. గోదావరి జిల్లాల్లో పోటీ చేస్తే అక్కడున్న కాపు ఓటు బ్యాంకు బలపడవచ్చని మరికొందరు సూచించినా, చివరకు గాజువాక ఫైనల్ అవడం ఖాయమని తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం సీజన్లో కూడా విశాఖ జిల్లా నుంచి చిరంజీవికి మంచి ఆదరణ లభించింది. వచ్చే వారంలో గాజువాకకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సీటుతో పాటు.. మరో పదిహేను మంది అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వీళ్ళందరికీ అంతర్గత సమాచారం వెళ్ళిపోయింది.ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా షురూ అయింది. గన్నవరం – పాముల రాజేశ్వరి, రాజమండ్రి – ఆకుల సత్యనారాయణ భార్య లక్ష్మీ పద్మావతి, విజయనగరం జిల్లా నెల్లిమర్ల – వర్షిణి లోకం, నర్సరావుపేట – సయ్యద్ జిలానీ, ముత్యంశెట్టి కృష్ణారావు – అవనిగడ్డ, పత్తిపాడు – రావెల కిశోర్ బాబు, గుంటూరు వెస్ట్- తోట చంద్రశేఖర్, తెనాలి – నాదెండ్ల మనోహర్.. ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి.

పవన్ కళ్యాణ్ గాజువాకకు కమిట్ అయితే వచ్చే ఇబ్బందుల్ని కూడా జనసేన చర్చిస్తోంది. గతంలో ‘కరవు జిల్లా అనంతపురం.. ఇక్కడినుంచే పోటీ చేసి కరవును పారదోలతా’నని బహిరంగ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల పర్యటన సమయంలో మరికొన్ని చోట్ల కూడా ఇదేరకమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు గాజువాకతో ఫిక్స్ అయితే.. ఆయా నియోజకవర్గాల నుంచి విముఖత వ్యక్తమవుతుందన్న ఆందోళన జనసేనది. ముఖ్యంగా రాయలసీమను పవన్ కళ్యాణ్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న వాదన ఇప్పటికే ఏర్పడిపోయింది. ఈ క్రమంలో ‘పవన్ – గాజువాక’ ప్రయోగం తాలూకు పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *