'టార్గెట్ 175'... అన్నీ తమవేనన్న జనసేన!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లోనూ పోటీకి దిగాలని జనసేన డిసైడైంది. ఈమేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్పష్ట ప్రకటన చేశారు. ”మనకున్న బలంపై మీడియాలో వస్తున్న ఊహాగానాల్ని పట్టించుకోవద్దు.. మనం దిగుతున్నాం.. అంతే..” అంటూ పార్టీ యాక్టివిస్టుల్ని ఉద్దేశించి పవన్ చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జనంలోకి వెళతామని, పోరాటాలు చేస్తామని ప్రకటించిన జనసేన.. ఎన్నికల విషయంలో మాత్రం కామ్రేడ్లతో కలిసి నడవదా? అన్న సందేహం రాజకీయవర్గాల్లో మొదలైంది. కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, మధులతో కలిసి ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర కూడా చేసిన పవన్ కళ్యాణ్.. పొత్తు దగ్గర మాత్రం దూరం పాటిస్తారా? అనేది బిగ్ క్వశ్చన్. ఇదిలా ఉంటే.. పవన్ తన పొలిటికల్ స్ట్రాటజీ మీద మరింత క్లారిటీ ఇస్తూ.. పార్టీ ఆఫీసులోనే క్యాడర్‌తో భేటీ పెట్టుకున్నారు. ”ప్రతి జిల్లాలో మనకు బలమైన మేథస్సున్న కార్యకర్తలున్నారు. కొన్ని వేల మందిని షార్ట్‌లిస్ట్ చేసి 1200 మంది వాలంటీర్లతో ఒక పటిష్టమైన మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం.. ఇక నుంచి మన పొలిటికల్ చీఫ్ స్ట్రాటజిస్ట్ ఇతడే” అంటూ దేవ్ అనే తెలుగేతర వ్యక్తిని పరిచయం చేశారు. తన దగ్గరుండే 350 మంది స్టాఫ్‌తో కలిసి దేవ్.. జనసేనకు వ్యూహరచన చేసిపెడతారన్నారు. మీడియా సమావేశం పెట్టి వివరాలు అందజేసే ఒక పొలిటికల్ ట్రెడిషన్‌ని బ్రేక్ చేస్తూ.. పార్టీ ఆఫీసులో జరిగిన ఒక ‘అంతర్గత భేటీ’ వీడియోని ట్విట్టర్లో పెట్టేశారు పవన్ కళ్యాణ్.