ఎర్ర పార్టీలతో కలిసి 'జనసేన తృతీయ కూటమి'?

ఏపీలో ఎర్ర పార్టీలు ఎటువైపు? ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నట్టు? లాంటి సందేహాలకు శాశ్వతంగా తెర దించేశారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. పోతే గీతే జనసేనతోనేనంటూ క్లారిటీ ఇచ్చేశారాయన. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో విశ్వసించదగ్గ రాజకీయ పార్టీల్లో జనసేన ఒక్కటే స్పష్టంగా కనిపిస్తోందన్నది రాఘవులు మాట. టీడీపీ విధానాలు రాష్ట్రానికి మేలు చేసేవిగా లేవని, ప్రతిపక్ష వైసీపీ పోరాట పంధా అనుమానాస్పదంగా ఉందని కుండబద్దలు కొట్టేశారు బీవీఆర్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన రాజకీయ విధానాన్ని స్పష్టం చేస్తే.. ఎన్నికల్లో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని రాఘవులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏపీ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. వామపక్షాలతో కలిసి పోరాటం చెయ్యడానికి పవన్ గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేసిన కారణంగా.. జనసేన-సీపీఎం దోస్తీ ఖరారైనట్లే లెక్క.

టీడీపీ, వైసీపీ ఇప్పటికే ఒంటరి పోరాటమేనంటూ క్లారిటీనిచ్చేశాయి. తమతో జట్టు కట్టడానికి ఏ పార్టీ కూడా మొగ్గు చూపకపోవడంతో బీజేపీది ‘ఒంటరి బతుకే’నని తేలిపోయింది. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ..! ఇప్పటికే టీడీపీతో టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ మీద అనుమానపు చూపులు పడ్డాయి. జనసేన పిలిచినా కలిసిపోతామంటూ కాంగ్రెస్‌లో ఒక గ్రూప్ సంకేతాలిచ్చింది. సో.. ఏపీలో తృతీయ కూటమికి పవన్ కళ్యాణ్ కసరత్తు మొదలుపెట్టవచ్చన్నది క్లియర్!