ఏపీలోని అతికొద్దిమంది ఫైర్‌బ్రాండ్ పొలిటీషియన్లలో చింతమనేని ప్రభాకర్ ఒకరు. దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా.. తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని.. ఇష్టారాజ్యంగా నడిపించుకుంటూ ఉంటారని చెబుతారు. ఆయన.. చేత్తో మాట్లాడే రకమని, ఎవ్వరినీ లెక్క చేయరని చెప్పడానికి అనేక సాక్ష్యాలు కూడా వున్నాయి. ఏదో ఒకటి చెయ్యడమో.. ఏదో ఒకటి అనడమో ద్వారా చింతమనేని తరచూ వార్తల్లో వుంటారు. మాజీ మంత్రి ఒట్టి వసంత్ కుమార్ మీద చేయిచేసుకున్నప్పుడు, ఎమ్మార్వో వనజాక్షి మీద దౌర్జన్యం చేసినప్పుడు, మీడియాను కంటిచూపుతో శాసించినప్పుడు, దళితుల్ని ‘కొ’ భాషలో దుర్భాషలాడినప్పుడు చింతమనేని ఒకేఒక్కడు అనిపించుకున్నాడు.

పార్టీకి ఎన్నిసార్లు తలఒంపులు తెచ్చినా ఆయన్ను ఉపేక్షిస్తూ వెళ్ళింది తెలుగుదేశం అధిష్టానం. క్యాబినెట్లోకి తీసుకొనేందుకు ఏకంగా చంద్రబాబు మీదే దండయాత్రకు ప్రయత్నించినట్లు ఆయన మీద అభియోగాలున్నాయి. అటు వైసీపీకి, ఇటు జనసేనకు కూడా కొరకరాని కొయ్యగా వున్న చింతమనేని ప్రభాకర్.. ఈసారి ఎన్నికల్లో ‘అగ్ని పరీక్ష’కు నిలబడ్డారు. అతడ్ని ఓడించడం కోసం వైసీపీ, జనసేన కంకణం కట్టుకున్నాయి. వైసీపీ తరపున కొటారు అబ్బయ్య చౌదరి బరిలో వున్నారు. జనసేన తరపున ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ చేస్తున్నారు. చింతమనేని విషయంలో తాను ఎంత సీరియస్‌గా ఉన్నానో పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారు. ‘చింతమనేని లాంటి రౌడీని ఓడించడానికి ఒక వీరమహిళను నిలబెడతాను’ అంటూ అప్పట్లోనే ప్రకటించిన పవన్.. అన్నంత పనీ చేశారు.

ఘంటశాల వెంకటలక్ష్మి.. ఎన్నో రోజులుగా మహిళా సమాజం కోసం ఉద్యమ బాటలో వున్నారు. సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఐద్వా తరపున సామాజిక అంశాలపై ఆందోళనను చురుగ్గా నిర్వహించేవారు. మరోవైపు ఎన్నో రోజులుగా మెగా ఫ్యామిలీకి అభిమానిగా ఉంటున్నట్లు జనసేన చెబుతోంది.

గతంలో చిరంజీవిని, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుని రాజకీయాల్లోకొచ్చేసింది. జనసేన వీరమహిళా విభాగంలో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు దెందులూరు లాంటి హాట్ సెగ్మెంట్లో టిక్కెట్ సంపాదించుకున్నారు. మహిళల ఓట్లు, పవర్ స్టార్ కరిష్మా కలిసి తనను గెలిపిస్తాయని, చింతమనేనిని మట్టి కరిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *