ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే యువతకు బంగారు భవిష్యత్తు అంటూ నిన్నటివరకూ రికార్డులు అరగదీసిన పార్టీలన్నీ ఇప్పుడు.. ఆ రికార్డుని అటకెక్కించేశాయి. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమని తెగేసి చెప్పిన బీజేపీ, రాగానే స్పెషల్ స్టేటస్ ఇస్తామని శపథం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సోయిలోనే లేకుండా పోవడంతో.. మిగతా మూడు ప్రధాన పార్టీలు కూడా స్పెషల్ స్టేటస్‌ని మూలకు నెట్టేశాయి. కానీ.. తామొస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ కొత్త దండోరా మొదలుపెట్టాయి.

అధికార తెలుగుదేశం పార్టీ.. ఉద్యోగాల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటే.. ‘బాబు పోవాలి.. జాబు రావాలి’ అంటూ ప్రతిపక్ష వైసీపీ యువతను ఎట్రాక్ట్ చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.3 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని, ఏటా ప్రతీ జనవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని, ఉద్యోగాల భర్తీ కోసం క్యాలెండర్ విడుదల చేస్తామని పలాస సభలో జగన్ ప్రతిజ్ఞ చేశారు. ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నాలుగడుగులు ముందుకేశారు. ‘అధికారంలోకి రాగానే మొదటి ఆరునెలల్లోనే మూడు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అన్నది పవన్ ఇస్తున్న భరోసా. వీటిలో 25 వేలు పోలీసు శాఖలోనే వుంటాయని మాటిచ్చారు.

ప్రత్యేక హోదా ఊసే లేకుండా.. లక్షలకొద్దీ ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న ఈ పార్టీలు.. దానికి తగిన నిర్మాణాత్మక ప్రణాళిక ఏమిటన్నది ప్రస్తావించడం లేదు. నారా లోకేష్ ఐటీ మంత్రిగా పవర్లోకొచ్చిన మరుసటిరోజునుంచీ ‘ఏటా లక్ష ఉద్యోగాలు’ అంటూ చెబుతూనే వున్నారు. కానీ.. ఆ మాట ఎక్కడా ఆచరణకు నోచుకోలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ”నాకు పాలనానుభవం తక్కువన్న సంగతి నాకూ తెలుసు. అందుకే తమిళనాడు మాజీ ఛీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావును పక్కన పెట్టుకున్నాను. పొరుగు రాష్ట్రంలాగే తెలుగు రాష్ట్రాన్ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తా’నని మాటిచ్చారు. స్పెషల్ స్టేటస్‌తో ప్రమేయం లేకుండానే ఇన్నేసి లక్షల ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం మనోళ్ళకుంటే.. 2019 ఎన్నికల తర్వాత ఏపీ యువతను అదృష్టం వరించినట్లే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *