బార్బీ బొమ్మ.. చూడగానే చేతికి తీసుకుని ముద్దాడాలనిపించే అందం దాని సొంతం. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వాళ్ళనూ ఆకట్టుకునే బార్బీ బొమ్మది 70 ఏళ్ల చరిత్ర. ఎప్పటికప్పుడు రీషేప్ అవుతూ.. సరికొత్త సోయగాలతో మార్కెట్లోకొచ్చే బార్బీ బొమ్మలంటే ఎవరు మాత్రం ముచ్చట పడరు..? జెస్సికా జెవెట్ కూడా అంతే. జార్జియాకు చెందిన ఈమె వయసు 37 ఏళ్ళు. కీళ్ల సంబంధిత వ్యాధి కారణంగా పుట్టుకతోనే అవిటిది. రెండు కాళ్ళూ, రెండు చేతులూ లేకపోయినా.. కేవలం మొండెంతోనే బతుకునీడుస్తున్నా.. ఆమెలోని ఆత్మస్థైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. ఒక రచయితగా, ఒక చిత్రకారిణిగా అరుదైన ఘనత సాధించి ప్రపంచ స్థాయి ఖ్యాతి పొందింది.

ఇంత సాధించినా ఆమెలో ఒక కోరిక మాత్రం చిన్నప్పటినుంచి గుండెల్లో గూడుకట్టుకుపోయింది. తనకెంతో ఇష్టమైన బార్బీ బొమ్మ.. ‘తనలాగా’ ఎందుకు లేదు? అనేదే ఆమె చింత. తన లాంటి ఆకారం వుండే వస్తువుల కోసం ఆరాటపడే అందరు పిల్లల్లాగే జెస్సికా కూడా.. తనలా చేతులూకాళ్ళూ లేని, వీల్ చెయిర్‌లో కూర్చున్న బార్బీ బొమ్మ కావాలనుకుంది. ఆరేడేళ్ల కిందట.. బార్బీ బొమ్మ తయారీ కంపెనీ Mattel కి అప్పీల్ కూడా పెట్టుకుంది. ఎట్టకేలకు ఆమె కోరికను మన్నించి.. వీల్ చైర్‌లో కూర్చున్న బార్బీ బొమ్మ డిజైన్‌ని ఓకే చేసింది Mattel కంపెనీ. ఈ జూన్లోగా అటువంటి బార్బీలు మార్కెట్లోకి రానున్నాయి. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ట్విట్టర్లో తన ఆనందాన్ని షేర్ చేసుకుంది జెస్సికా.

”దీనికోసం ‘300 ఏళ్లు’గా ఎదురుచూస్తున్నా..! నాకు 37 ఏళ్ల వయసున్నప్పటికీ నా బార్బీ కోసం నేను మళ్ళీ ’80ల్లోకి వెళ్ళిపోతాను. చిన్నపిల్లనైపోయి ఆడుకుంటాను..” అంటూ తనలోని భావుకతను వ్యక్తపరిచింది. నోటితోనే బొమ్మలేసి, ప్రపంచం మెచ్చిన చిత్రకారిణిగా పేరు తెచ్చుకున్న జెస్సికా.. ఇప్పుడు దొరికిన ఈ ఆనందం ముందు అవన్నీ దిగదుడుపేనంటోంది.

ఈ అనిర్వచనీయమైన అనుభూతి చూడ్డానికి సిల్లీగా అనిపించినా, ఆమె ఆశలో ఒక బరువైన భావన దాగుంది. తనలాంటి ఎందరో అవిటివాళ్లలో ఆత్మాభిమానం పెరగాలంటే, మిగతా వాళ్ల మధ్య మామీదుండే వివక్ష వాతావరణం పోవాలంటే.. ఇటువంటి ప్రయత్నాలు చాలాచాలా జరగాల్సిందేనంటోంది జెస్సికా.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *