కేసీఆర్ తన ఢిల్లీ ఎజెండాలో కీలక మార్పు చేసుకున్నారు. ఈసారి ఎంపీగా పోటీచేసి లోక్‌సభలో ఎంట్రీ ఇచ్చి ఢిల్లీలో చక్రం తిప్పుతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికి చెక్ పెట్టేశారు. తాజాగా విడుదల చేసిన తెరాస ఎంపీ అభ్యర్థుల జాబితాలో తనకు చోటు లేకుండా చేసుకున్నారాయన. కూతురిని రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకుని అల్లుడు అనిల్‌ని నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయిస్తారన్న రూమర్లకు కూడా తెర దించేశారు. మొత్తమ్మీద 16కు 16 మావే గెలుపుగుర్రాలు అని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఆ 16 మంది పేర్లను ఒకేసారి జనంలో పెట్టేశారు.

తాజా జాబితాలో ఒకేఒక్క సర్‌ప్రైజ్.. మహబూబ్ నగర్ ఎంపీ, లోక్‌సభలో తెరాస ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డికి ఈసారి ఛాన్స్ దక్కలేదు. లోక్‌సభ‌లో పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించి ఎన్నోసార్లు సెహబాష్ అనిపించుకున్న జితేందర్ రెడ్డి.. కంటిన్యువేషన్ దక్కనందుకు అసంతృప్తిగా లేదని, కేసీఆర్ ఏ పని ఇస్తే ఆ పని చేస్తానని చెబుతున్నారు. పార్టీ మారే ఆలోచన లేదని తేల్చేశారు. అజ్మీరా సీతారాంనాయక్‌ (మహబూబాబాద్‌)కి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం)కి కూడా మరో ఛాన్స్ ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించలేదు.

తలసాని కొడుకు సాయికిరణ్ యాదవ్‌‌కి సికింద్రాబాద్ సీటు దక్కింది. బాల్క సుమన్ తప్పుకోవడంతో ఖాళీ అయిన పెద్దపల్లి సీటుని బోర్లకుంట వెంకటేష్ చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన జీ. వినోద్‌కి పెద్దపల్లి ఛాన్స్ వస్తుందని అందరూ అనుకున్నా అదేమీ జరగలేదు. నిన్ననే పార్టీలో చేరిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావును ఖమ్మం ఎంపీ సీటు వరించింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా సెటిలైన మల్లారెడ్డి సిట్టింగ్ సీటు మల్కాజ్‌గిరిని మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చింది అధిష్టానం. నల్గొండ (కాంగ్రెస్) సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్ నుంచి హామీ లభించిందట.

ఆదిలాబాద్ – గోడెం నగేష్, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్, చేవెళ్ల – రంజిత్ రెడ్డి, హైదరాబాద్ – పుస్తె శ్రీకాంత్, కరీంనగర్ – బి. వినోద్, ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు, నల్గొండ – వేమిరెడ్డి నరసింహారెడ్డి, వరంగల్ – పసునూరి దయాకర్, జహీరాబాద్ – బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ – పీ. రాములు, మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస రెడ్డి, మల్కాజ్ గిరి – మర్రి రాజశేఖర్ రెడ్డి, మహబూబాబాద్ – మాలోతు కవిత, నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత, మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి, పెద్దపల్లి – బోర్లకుంట వెంకటేష్, సికింద్రాబాద్ – తలసాని సాయికిరణ్ యాదవ్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *