ఎన్నికలు సమీపిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తన మాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రావడం కష్టమన్నారు. ఇప్పటినుంచే సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాను ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పార్టీకి అధికారం వస్తే.. ఐదేళ్లలో విజయవాడను హైదరాబాద్‌లా మారుస్తానని చెప్పారు.

ప్రజాశాంతి పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని, 20 మంది ఎంపీలను ఏపీ నుంచి గెలిపిస్తే.. కేంద్రంలో తాము కీలకంగా మారుతామన్నారు. ఆనాడు దేవేగౌడ తక్కువమంది ఎంపీలతో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. టీడీపీ, వైసీపీ ఈసారి ఏపీలో భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. బీజేపీతో ఆ రెండు పార్టీలకు అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలంటే టీడీపీ, వైసీపీలకు ఓటు వేయవద్దని కుండబద్దలు కొట్టేశారు.

ప్రజాశాంతి పార్టీ ద్వారా 60వేల మంది నిరుద్యోగ యువతకు తాము ఓ అవకాశం కల్పిస్తున్నామన్నారు కేఏ పాల్. ఒక్కో వ్యక్తి 1000 మందిని ప్రజాశాంతి పార్టీలో చేర్పించాలని, అప్పుడు ఆరు కోట్ల మంది పార్టీలో చేరినట్లు అవుతుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు స్టయిఫండ్ రూ.3 వేలు ఇస్తానని, అక్టోబర్ నాటికి ఉద్యోగాలు ఇచ్చి తీరుతానని హామీలు గుప్పించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *