‘కాలా’ మూవీ రివ్యూ

‘కాలా’ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నాడు సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్. ఆయన నటించిన ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా గురువారం భారీ ఎత్తున రిలీజైంది. కబాలి డిజాస్టర్ తర్వాత డైరెక్టర్‌ పా రంజిత్‌తో తలైవా చేసిన సెకండ్ ఫిల్మ్ కాలా. తక్కువ సమయంలో మూవీని తెరకెక్కించినా అనివార్య కారణాల వల్ల విడుదల డిలే అయ్యింది. స్టార్ హీరో ఫిల్మ్ అనగానే హీరోయిన్ ఎవరనేది అభిమానులు చర్చించే ప్రశ్న. ఈసారి మాత్రం ఫేమస్ హీరోయిన్‌ని కాకుండా బాలీవుడ్ బ్యూటీ హ్యూమ ఖురేషిని తీసుకున్నారు. ఈ కాంబో ఆకట్టుకుందా? ఈ ఫిల్మ్.. కబాలిని అధిగమించిందా? అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్దాం..

 

 
స్టోరీ.. ముంబైలోని ధారావి అనే స్లమ్ ప్రాంతానికి పేదల పెన్నిధి కరికాలన్ (రజినీకాంత్). ఎన్ని సమస్యలొచ్చినా అక్కడి ప్రజలను కాపాడుతూవుంటాడు. కానీ ప్రముఖ రాజకీయ పార్టీ లీడర్ హరిదాస్ (నానాపటేకర్) తన అధికారంతో ధారావి ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. హరిదాస్ చేసే కుట్రల్లో కాలా ఫ్యామిలీ ఏమవుతుంది? అప్పుడు కాలా ఏం చేశాడు? ధారావి..హరిదాదా చేతుల్లోకి వెళ్లకుండా ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఆ ప్రాంత ప్రజల‌ను ఒక్కటి చేసేందుకు ఎలాంటి పోరాటాన్ని ఎంచుకున్నాడు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే!
 

విశ్లేషణ.. ప్రజల కోసం పోరాడే నాయకుడు పాత్రలో రజినీకాంత్‌ ఒదిగిపోయాడు. సినిమాకి ప్రధాన బ‌లం హీరోనే! కబాలి మాదిరిగా కాకుండా ఈ ఫిల్మ్‌లో చాలా ఎనర్జిటిక్‌ గా కనిపించాడు. ధారావి ప్రాంతం నుంచి పేదలను తరిమేసి కార్పొరేట్ బిజినెస్ చేయడానికి ప్రయత్నించిన ఓ రాజకీయ నాయకుడిని హీరో ఎలా ఎదుర్కొన్నాడన్న థీమ్‌తో స్టోరీని అల్లుకున్నాడు డైరెక్టర్ పా. రంజిత్. ఈ పాయింట్‌కి ఆసియాలో అతిపెద్ద స్లమ్ అయిన ధారావి ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. భూమి అనేది అంద‌రి హ‌క్కు అనేది ర‌జ‌నీకాంత్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేశాడు. త్వర‌లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ర‌జినీకి ఇది పనికొచ్చే అంశం.

 

 

తంబీలకు ఇష్టమైన నలుపు కలర్ డ్రెస్సుల్లో తలైవా కనిపించాడు. దీనికితోడు రజినీ స్టైల్‌ని పూర్తి వినియోగించుకుని స్క్రీన్ మీద చూపించాడు డైరెక్టర్. మూవీ మొదలైన చాలాసేపటి వరకు రజనీకి సరైన డైలాగ్‌లు ఇవ్వలేదు. స్టోరీ వెళ్తున్నకొద్దీ ఆయన పాత్రను క్రమంగా పెంచాడు. తలైవా తర్వాత ఇందులో కీలకమైన నటుడు నానా‌పటేకర్. తెరపై ఇటు రజినీ- అటు నానాపటేకర్‌ ఒకేసారి చూసినప్పుడు యుద్ధానికి దిగినట్టుగా కనిపిస్తారు. ఎన్జీవో స‌భ్యురాలుగా హ్యూమఖురేషి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా రజినీ వైఫ్‌గా ఈశ్వరీరావు న‌ట‌న ప్రేక్షకుల‌ను మెప్పిస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా రజినీకాంత్‌ని చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమతో లవ్, ఫెయిల్ వంటివి చూపించాడు. అలాగే ఈశ్వరీరావు- ర‌జ‌నీల మ‌ధ్య సీన్స్ బావున్నాయి. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టే ఫేస్‌లేవీ లేవు.

ఇంటర్వెల్‌కి ముందు నానా పాటేకర్‌-రజనీ మధ్య సన్నివేశాలు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. సెకండాఫ్‌కి వచ్చేసరికి ధారావి చుట్టూనే కథ తిరుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. రజనీకాంత్‌ తప్ప మరో ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోవడం సినిమాకి నెగిటివ్ పాయింట్. ముఖ్యంగా కథనంలో వేగం తగ్గడం ప్రధాన లోపం.

మధ్యలో వచ్చే కాలా ఫ్యామిలీ సీన్స్ కొంచెం బాగున్నా, ఇంకొన్ని చిరాకు తెప్పిస్తాయి. కానీ, రజనీ హీరోయిజాన్ని ఎలివేట్ చేయలేకపోవడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మినహా ఎగ్జైట్ చేసే సన్నివేశాలు పెద్దగా లేవు. కొన్ని సన్నివేశాలకు కత్తెరలు వేయాల్సింది. కేవలం రజనీకాంత్ కోసం వెళ్లేవాళ్లకి మాత్రమే ఫర్వాలేదనిపిస్తుంది.