కాజల్‌కి వెరైటీ రోల్

గ్లామర్ ఇండస్ర్టీలో హాఫ్ సెంచరీ సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. ఈసారి గ్లామర్ పాత్రలు కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయాలన్నది ఆమె ప్లాన్. అందుకే ఈసారి పౌరాణిక తరహా మూవీలో నటించాలని ఆలోచన చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే రావణుడి సోదరి ‘శూర్పణఖ’ రోల్‌లో నటించడానికి కాజల్ రెడీ అయినట్టు సమాచారం. శూర్పణఖ క్యారెక్టర్‌ని ఆధారంగా చేసుకుని సోషియో ఫాంటసీ మూవీని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ భార్గవ్. యానిమేషన్ ఫిల్మ్ మేకింగ్‌లో జాతీయ అవార్డ్ సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్, దీన్ని తెరకెక్కించాలని ముందుకు రావడం విశేషం.

రామాయణంలో శూర్పణఖ అసలు క్యారెక్టర్ ఏ విధంగా వుంటుందో చాలామందికి తెలీదు. అంతేకాదు రాముడు- రావణుడు మధ్య యుద్ధం జరగడానికి ఈమె కారణమని పురాణాలు చెబుతున్నాయి. ఐతే, శూర్పణఖ పాత్రను తెరపై అందంగా చూపించే విధంగా స్టోరీని రెడీ చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. ఈ స్టోరీ కూడా కాజల్‌కి బాగా నచ్చడంతో ఓకే చేసినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఆ తర్వాతే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు టాక్.