తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్.. ఇద్దరికీ సమాంతర శక్తులన్న పేరుంది. అభిమానుల్ని సంపాదించుకోవడంలో ఒకరిని మించి మరొకరు ఎదిగిపోయారు. తెర మీద ఇద్దరి శైలీ భిన్నంగా ఉన్నప్పటికీ, తెర వెనుక మాత్రం అపూర్వ సహోదరుల్లా కలిసిమెలిసి ఉంటూ.. పొరపొచ్చాల్లేకుండా కెరీర్‌ని నడిపించుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ పీక్ స్టేజ్‌లో ఉండడం.. ఇద్దరూ పొలిటికల్ అరంగేట్రం చేయడంతో.. సహజంగానే ఇద్దరి మధ్య తేడాలొస్తాయని అంచనా కట్టింది కోలీవుడ్ పరిశ్రమ.

స్వభావాలేవైనా.. భావజాలాల రీత్యా ఇద్దరిదీ విరుద్ధ ధోరణి. రజనీకాంత్ పూర్తి ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ.. ఒకానొక సందర్భంలో బీజేపీకి దగ్గరయ్యారన్న వార్తలకు ఆస్కారమిచ్చారు. కమల్ మాత్రం వామపక్ష భావజాలంతో నడక మొదలుపెట్టారు. ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసే అవకాశాల్ని కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రాజకీయ దారులు వేరువేరని తేలిపోయింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 40 ఎంపీ సీట్లకూ అభ్యర్థుల్ని బరిలో దింపుతానంటూ ‘మక్కల్ నీతి మెయ్యమ్’ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇప్పటికే ప్రకటించి.. సగం తమిళనాడు తిరిగొచ్చారు కమల్. గ్రామ సభల పేరుతో జనాన్ని కలిసి మమేకం అవుతున్నారు కూడా.

రజనీకాంత్ మాత్రం తన పొలిటికల్ ఎంట్రీపై అస్పష్టంగానే కదులుతున్నారు. ‘రావడం ఖాయం’ అంటూ రాజకీయ ప్రకటన చేసి దాదాపు ఏడాది గడిచినా.. ఎప్పుడొస్తారన్న క్లారిటీ ఇవ్వడంలో మాత్రం వెనకబడ్డారు. అధికార అన్నాడీఎంకే చితికిపోయి తమిళనాట స్పష్టమైన పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తున్నా.. రజనీలో చైతన్యం కొరవడింది. తాజాగా.. ‘లోక్ సభ ఎన్నికలకు దూరంగా వుండబోతున్నాం. నా పేరు గానీ నా ఫోటో గానీ ఎవరూ వాడుకోవద్దు’ అంటూ రజనీ చేసిన ప్రకటన మరోమారు ఆయన ఊగిసలాట ధోరణిని బయటపెట్టింది. చివరకు కమల్ హాసన్ కూడా.. రజనీకాంత్ డైలమాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

”కొంతమంది మల్లయోధులు అంత ఈజీగా యుద్ధానికి సిద్ధం కాలేరు. గోచీ కట్టి.. ఒళ్ళంతా నూనె రాసుకుని, రింగు దాకా వస్తారు. తీరా బరిలో దిగబోయేసరికి ‘మళ్ళీ కలుద్దాం’ అంటూ వాయిదా వేసుకుని వెళ్ళిపోతారు” అంటూ రజనీకాంత్ మీద సెటైర్ వేశారు కమల్. సహచర స్టార్ అయినప్పటికీ.. రాజకీయాల్లో శత్రువును శత్రువుగానే చూడాలన్న జ్ఞానోదయం కావడం వల్లే కమల్ హాసన్ ఈవిధంగా స్పందించారు. కమల్ హాసన్ సిసలైన రాజకీయ నాయకుడిగా మారిపోయాడు.. అంటూ కామెంట్లు కూడా పడిపోతున్నాయి. మరి.. రజనీ మార్క్ రాజకీయం చూసే అదృష్టం ఆయన అభిమానులకు ఎప్పుడు కలుగుతుందో!?

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *