పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 49 మంది జవాన్ల మరణం, ఆ మరుసటిరోజే జమ్మూలో ఓ బాంబును నిర్వీర్యం చేయడానికి యత్నించిన ఓ సైనికాధికారి ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు కాశ్మీర్ విద్యార్థుల్లో అత్యంత భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అనేకమంది స్టూడెంట్స్ ప్రాణాలు అరచేత పట్టుకుని హర్యానాలోని అంబాలా వంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు.

తమ చదువు కన్నా తమ ప్రాణాలు ముఖ్యమని అంటున్నారు. అమాయకులైన తమను కూడా ఉగ్రవాదులుగా ముద్ర వేసి స్థానికులు, బజరంగ్ దళ్ వంటి సంస్థల కార్యకర్తలు హింసించవచ్చునని, లేదా హతమార్చవచ్చునని వారు వణికిపోతున్నారు. అనంత్ నాగ్‌కు చెందిన 18 ఏళ్ళ విద్యార్థి ఒకరు అంబాలాకు పారిపోయి.. ఓ అద్దె ఇంట్లో ఓ రాత్రంతా దాక్కున్నాడట. జీవితంలో తానెప్పుడూ ఇంతగా భయపడలేదని ఆ విద్యార్థి చెబుతున్నాడు. ఇలాంటి స్టూడెంట్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారు.

తమ ఇళ్ళలో అద్దెకు ఉంటున్న కాశ్మీరీలను, విద్యార్థులను వెంటనే ఖాళీ చేయించాలని ఇంటి యజమానులను స్థానికులు కోరుతున్నారట. ఇద్దరు స్టూడెంట్స్‌ను బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్ సంస్థలకు చెందినవారుగా భావిస్తున్న కార్యకర్తలు, నాయకులు చితకబాదడాన్ని వీడియోగా తీసి ఇళ్ళ యజమానులకు పంపారట. ఈ వీడియో చూసిన తమ పై ప్రాణాలు పైనే పోయాయని అనేకమంది కాశ్మీరీ విద్యార్థులు తెలిపారు. చండీగడ్, హర్యానా వంటి ప్రాంతాల నుంచి తాము తిరిగి కాశ్మీర్‌కు ఎలా వెళ్ళగలమని ఈ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

జమ్ములో హింసాత్మక ఘటనలు రేగినప్పుడు అధికారులు కర్ఫ్యూ విధించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. చండీగడ్‌లో ఓ షెల్టర్‌ను ఏర్పాటు చేసిన జమ్మూ కాశ్మీర్ విద్యార్థి సంఘం పంజాబ్ శాఖ 50 మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పించింది. అటు-డెహ్రాడూన్‌లోని స్టూడెంట్స్‌ని మూడు రోజులపాటు నిర్బధించడం జరిగిందని ఈ షెల్టర్ నిర్వాహకుడొకరు చెప్పారు. వీరు ఉంటున్న హాస్టల్‌కు బజరంగ్‌దళ్ కార్యకర్తలు చేరుకొని వీరిని, వీరి హాస్టల్ యజమానులను తీవ్రంగా బెదిరించారట. ఈ ‘ భయానక పరిస్థితి ‘ ఎప్పుడు తొలగుతుందో.. తాము మళ్ళీ సురక్షితంగా ఎప్పుడు కాశ్మీర్ చేరుకుంటామో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు కాశ్మీరీ విద్యార్థులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *