ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమన్నారు 2018 ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రైతులు, పేదలు, సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయం ఇదన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతీఒక్కరికీ శిరస్సువంచి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని.. ఈ సందర్భంలో అణకువ, వినయం, విధేయత అవసరమని, ఎన్నికల ఫలితాలతో గర్వం రాకూడదన్నారు. కర్తవ్యనిష్టతో సమయం వెచ్చించాలితప్ప వృధా చేయకూడదని.. నెగిటివ్ పవర్ వైపు వెళ్లొద్దని కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు నేతలకు సూచించారు. కోటి ఎకరాలు తెలంగాణలో పచ్చబడాలని, ఈ లక్ష్యం తప్పక నెరవేరాలన్నారు. ధనికులైన రైతులు తెలంగాణలో ఉన్నారన్న పేరు తెస్తామని కేసీఆర్ అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ యువతలో కొంత అసహనం ఉన్నమాట వాస్తవమని అయితే, ఇది తెలంగాణలో మాత్రమే ఉన్న సమస్య కాదని యావత్ దేశంలో ఈ సమస్య ఉందని, సంపూర్ణ ఆరోగ్యతెలంగాణ, సస్యశ్యామల తెలంగాణ, శాంతియుత తెలంగాణే తమ లక్ష్యమన్నారు కేసీఆర్.

పేదరికానికి కులంమతం లేదని అది ఎవరినైనా దహిస్తుందని పేదరిక నిర్మూలనకు తప్పకుండా చర్యలు చేపడతామని అగ్రకులస్తులకు కూడా వందశాతం న్యాయం జరిగేలా విద్యా, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఎలాంటి దుమ్మీలు, లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చాలా గొప్పగా ఎన్నికల ప్రక్రియ ముగియడం దేశానికే గర్వకారణమని కేసీఆర్ అన్నారు.

నిన్నటివరకూ తెలంగాణ తన అస్తిత్వంకోసం పోరాడి, ఇప్పుడు తానేంటో నిరూపించుకుంటోందన్నారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలని తాను ఎన్నికల సభల్లో పదేపదే చెప్పానని.. ఈరోజు ప్రజలే గెలిచారని కేసీఆర్ అన్నారు. ప్రధాని, సోనియా గాంధీ సహా ఎంతోమంత్రి ప్రచారంలో పాల్గొన్నారని అంతిమంగా ప్రజలు తమ స్పష్టమైన తీర్పునిచ్చారని కేసీఆర్ అన్నారు. దేశరాజకీయాలకు తెలంగాణ ఒక దిక్సూచి అని చెప్పారు. ఒక కొత్త పొలిటికల్ ముఖచిత్రం రావాల్సి ఉందని, ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పాలన వచ్చితీరాలని, ఈరోజు తెలంగాణ ఆదిశగా ఒక మార్గాన్ని నిర్దేశించిందని కేసీఆర్ అన్నారు.

70వేల టీఎంసీల నీళ్లు ఈదేశంలో అందుబాటులో ఉంటే కేవలం 30శాతం నీటిని మాత్రమే ఈ దేశం ఉపయోగించుకుంటోందని, దేశంలోని ఈ జాతీయపార్టీలు సిగ్గుపడాల్సిన విషయమిదని కేసీఆర్ అన్నారు. ఇజ్రాయిల్ వంటి దేశంతో పోలిస్తే ఇది చాలా అవమానకరమని వ్యాఖ్యానించారు. 15 కోట్లమంది ఈ దేశంలో రైతులున్నారని, వాళ్లగతి అన్నమో రామచంద్రా అన్నట్టుందని వాపోయారు. ఈ దేశం రైతులకు, యువతకు పిలుపునిస్తున్నానని సిల్లీ పార్టీలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ అన్నారు. 73 ఏళ్ల ప్రజాస్వామ్యంలో దేశ వ్యాప్తంగా నీళ్లు పారించలేకపోవడం చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. నాలుగుపార్టీలను ఒకచోటకి చేర్చి భుజాలు చరచుకోవడం గొప్పకాదని కేసీఆర్ ఇండైరెక్ట్ గా చంద్రబాబుని టార్గెట్ చేశారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందంటే అది కేవలం దిక్కులేకమాత్రమే జరిగిందన్నారు కేసీఆర్. ‘తూ కిత్తా మైకిత్తా’ అనే పద్దతి పోవాలంటే తెలంగాణలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో అదే దేశవ్యాప్తంగా రావాల్సి ఉందన్నారు. రాబోయే మూడునెలల్లోనే దేశంలో ఒక గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నామని కేసీఆర్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు 50శాతం రిజర్వేషన్స్ దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని కేసీఆర్ అన్నారు. ఆయా రాష్ట్రాల్లోని జనాభాల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకుంటామంటే మీరెవరు ప్రశ్నించడానికి అని కేంద్రప్రభుత్వా్ల్ని కేసీఆర్ ప్రశ్నించారు.

ఇంత పెద్దదేశానికి ఒకే ఒక్క సుప్రీంకోర్టు పెడతారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మార్పురావాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ అన్నారు.  దేశంలోని ప్రతీ పౌరుడ్ని గౌరవించే విధానం రావాలన్నారు.  తెలుగుప్రజలమీద చంద్రబాబుకంటే తనకే అభిమానం ఎక్కువన్న కేసీఆర్, తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తానంటూ కేసీఆర్ సెటైర్ వేశారు. ఈ అంశంపై రేపు పూర్తి స్పష్టతనిస్తానన్నారు.  చంద్రబాబు ఒక సందర్భంలో మోదీని అతిగా పొగడబోయి బోర్లాపడ్డారంటూ అప్పటి సంగతుల్ని గుర్తుచేశారు కేసీఆర్. రేపు 11.30 కు టీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *