‘దక్షిణ తెలంగాణలో మనకంత సీన్ లేద’న్న మాట తెరాసలో ఎప్పట్నుంచో వినిపిస్తూ ఉండేదే. ఖమ్మం, పాలమూరు, నల్గొండ జిల్లాల్లో గులాబీ పరిమళం అంతంత మాత్రమేనన్న విషయం అధినేత కేసీఆర్‌కీ తెలీనిది కాదు. అయితే.. ఇటీవలి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ లోటు కాస్త పూడినట్లే కనిపించింది. ఆ మూడు జిల్లాల్లో కూడా తెరాసేతర పార్టీల హవా బాగా సన్నగిల్లిపోయింది. అయినప్పటికీ.. కేసీఆర్ గాలి ఎంత బాగా వీచినప్పటికీ.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు.

లోక్ సభ ఎన్నికల సీజనొచ్చేసింది. 16 సీట్లు మనవే కావాలి అంటూ పదేపదే గట్టిగా చెబుతున్నప్పటికీ.. ఖమ్మం ఎంపీ సీటు మీద కేసీఆర్‌కి ఇప్పటికీ సందేహాలున్నాయి. అందుకే.. ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను, కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును తెరాసలోకి లాగేసుకున్నారు. లీడర్లతో పాటు క్యాడర్లు కూడా వచ్చేస్తారన్నది గులాబీ బాసుల ఆశ. ఇదిలా ఉంటే.. ఆఖరి అస్త్రంగా.. జిల్లాలో పట్టున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మీద గాలమేసింది. ఆయన టీడీపీకి రాజీనామా చేశారన్నది తాజా సమాచారం.

ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం తెరాసకు పక్కబలాలుగా వున్నారు. ఇప్పుడు కొత్తగా నామా నాగేశ్వరరావు చేరిక ద్వారా ఖమ్మం మీద కేసీఆర్ పట్టు మరింత బిగుసుకుంటుందని.. ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ద్వారా పచ్చ దండు మొత్తం గులాబీ దండుగా మారిపోవచ్చని కేటీఆర్ ప్లాన్ వేశారు. నల్గొండ జిల్లాలో నకిరేకల్ ఎమ్మెల్యేని ఎట్రాక్ట్ చేయడం ద్వారా కోమటిరెడ్డి వెయిట్‌కి గండి కొట్టింది తెరాస. సో.. పాతబస్తీ ఒక్కటి మజ్లీస్ సోదరులకు వదిలేస్తే.. మిగతా 16 అణాలు మనవే అవుతాయని.. అచ్చమైన విజయం ఖాయమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *