గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఘన విజయం సాధించారు. కేసీఆర్ ఓటమి కోసం చివరివరకూ ప్రయత్నించిన విపక్షానికి ఇదీ ఒక షాక్ లాంటిదే. ప్రజా కూటమి తరఫున పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 51, 554 ఓట్ల మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టిన కేసీఆర్.. తానేంటో మరోసారి చాటుకున్నట్లయింది. గత ఎన్నికల్లో ఇదే వంటేరు ప్రతాప రెడ్డి టీడీపీ తరఫున బరిలోకి దిగగా.. కేసీఆర్ 19, 391 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. నాటి ఎలక్షన్స్ కన్నా ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెట్టింపు మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. కేసీఆర్ తో బాటు మంత్రి హరీష్ రావు వ్యూహాల ముందు కాంగ్రెస్ ఎత్తుగడలు పని చేయలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. సిద్ధిపేట నియోజకవర్గం కన్నా హరీష్ రావు గజ్వేల్ పై ఎక్కువగా దృష్టి పెట్టి ప్రచారం చేయడం విశేషం.

అటు మేనల్లుడు తన్నీరు హరీష్ రావు.. సిద్ధిపేటలో ఏకంగా లక్షా 20 వేల ఓట్ల లీడ్ సాధించి.. పాత రికార్డుల్ని బద్దలుకొట్టేశాడు. తండ్రికి తగ్గ తనయుడు, మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.కె.మహేందర్ రెడ్డిపై 89 వేల ఓట్ల భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగురవేశారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ క్యాండిడేట్ రవీందర్ రావుపై ఆయన 53 వేలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *