గల్లీలో ఉంటా.. ఢిల్లీలో ఉంటా.. ప్లీనరీలో కేసీఆర్ రీసౌండ్!

హైదరాబాద్‌ శివార్లలోని కొంపల్లిలో జరిగిన తెరాస 17వ ప్లీనరీ వేదిక కేసీఆర్ గర్జనతో దద్దరిల్లింది. జాతీయ పార్టీల్ని చీల్చిచెండాడి.. తానేంటో త్వరలోనే చూపిస్తానంటూ హెచ్చరించారు. ప్రారంభోపన్యాసంలో దేశ రాజకీయాల్ని టార్గెట్ చేసి, తన పొలిటికల్ విజన్ ఏంటన్నది ఆవిష్కరించారు. ముగింపు ప్రసంగంలో ప్రభుత్వ పథకాల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని, పార్టీకున్న విజయావకాశాల్ని విఫులంగా ప్రస్తావించారు.

 

  • సిట్టింగ్ లందరికీ సీట్లిస్తా!

రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ లందరికీ సీట్లిస్తానని, ఎటువంటి ఊహాగానాల్ని నమ్మొద్దని పార్టీ అధ్యక్షుడి హోదాలో లీడర్లకు హామీనిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది.. మరిన్ని సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టుకుందాం.. ఇదే దూకుడుతో ముందుకు పోదాం.. అంటూ పార్టీలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు.

 

  • అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా..

హైదరాబాద్‌లోనే ఉండి దేశంలో భూకంపం పుట్టిస్తానంటూ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. తాను చేసిన థర్డ్‌ఫ్రంట్ ప్రకటనతో దేశమంతా ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. హైదరాబాద్ కేంద్రంగానే దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, తెలంగాణ వదిలి వెళ్లనని, గులాబీ పరిమళాల్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు వెదజల్లి, కాంగ్రెస్-బీజేపీ కబంధ హస్తాలనుంచి దేశాన్ని విడిపిస్తానని ఛాలెంజ్ చేశారు కేసీఆర్.

 

  • నాకొదిలేయండి తడాఖా చూపిస్తా!

ఇన్నేళ్ళుగా దేశాన్ని భ్రష్టుపట్టించిన ఈ రెండు పార్టీలే ఇంకా మనల్ని ఏలాలా.. అంటూ ప్రశ్నించారు. భారత రాజకీయాల్లో గుణాత్మక మార్పు సాధించడంలో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందనే తీర్మానాన్ని ప్లీనరీలో ఆమోదింపజేశారు. దేశంలో నీటివివాదాలు పరిష్కరించడం తెలీదు, విదేశాలతో ఎలాంటి వైఖరి అనుసరించాలో తెలీదు అంటూ జాతీయ పార్టీల్ని చెడామడా తిట్టేసిన కేసీఆర్.. ‘నాకొదిలేయండి తడాఖా చూపిస్తా’ అనేంత ఆవేశపూరిత స్థాయిలో సాగించారు ప్లీనరీ ప్రసంగాన్ని.

 

  • అసలు లక్ష్యం.. ఆకుపచ్చ తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం గత నాలుగు సంవత్సరాలుగా ఉన్నంత ప్రశాంతంగా గతంలో ఎప్పుడూ లేదు.. ఇదే ప్రశాంతతను మరో 40 ఏళ్లపాటు నిలబెట్టుకుందాం.. అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బంగారు తెలంగాణ ఆకాంక్షను నిజం చేసుకోవడంతో పాటు కోటి ఎకరాల్లో సాగునీరు పారించి ఆకుపచ్చ తెలంగాణను కూడా సాధ్యం చేసుకుందామని పిలుపునిచ్చారు.

 

  • మన పనులే మనల్ని గెలిపిస్తాయి!

మిషన్ భగీరథ, కంటి వెలుగు, రైతులకు చెక్కుల పంపిణీ లాంటి మంచి పనులు చేస్తున్న మనల్ని మన ప్రజలే కాపాడుకుంటారు అంటూ పార్టీ క్యాడర్‌కి భరోసానిచ్చారు. ఇండియాలో 24 గంటల విద్యుత్ ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనన్న కేసీఆర్.. మిగతా రాష్ట్రాలకు మనం ఆదర్శప్రాయంగా నిలబడినందుకు గర్వపడాలన్నారు.

 

  • మోదీలూ, గాంధీలూ గంధర్వులేం కారు!

అనేక విషయాల్లో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడ్డ మనం.. దేశాన్ని పాలించడానికి అర్హులం కాలేమా అంటూ ప్రశ్నించారు కేసీఆర్. దీంతో గులాబీ దళపతి అసలు లక్ష్యం ఏమిటన్నది మరింత స్పష్టంగా తేలిపోయింది.