దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకతను మూటగట్టి.. కోల్ కతా వేదికపై మెగా ప్రదర్శనకు పెట్టనుంది బెంగాల్ దీదీ మమతా బెనర్జీ. తన రాష్ట్రంలో కమ్యూనిస్టుల కంటే బీజేపీనే ప్రధాన శత్రువుగా భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి.. ఈనెల 19ని బలప్రదర్శనకు ముహూర్తంగా పెట్టుకుంది. కొన్ని నెలలుగా ఈ ర్యాలీ, బహిరంగ సభల కోసం కసరత్తు చేసి.. దాదాపు 20 పార్టీల మద్దతును కూడగట్టుకుంది. తనను తాను ప్రధానిగా ఎక్స్‌పోజ్ చేసుకునేందుకు.. ఆమె ఈ సందర్భాన్ని వాడుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టి.. మోదీని ఇంటికి సాగనంపాలన్న ఏకవాక్య ఎజెండాతో జరుగుతున్న కోల్‌కతా సభకు అతిరథ మహారధులు వస్తారని తృణమూల్ పార్టీ ప్లాన్ చేసింది. కానీ.. కూటమి పెద్దన్న పాత్రలో వున్న రాహుల్ గానీ, సోనియా గానీ సభకు రావడం లేదు. లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ ప్రతినిధిగా పంపుతూ.. మమతకు తన శుభాకాంక్షల సందేశాన్ని ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ.

ఇటు.. మరో కీలక పక్షం బీఎస్పీ కూడా కోల్ కతా మీట్‌ని లైట్ తీసుకుంది. మాయావతి రాకుండా.. పార్టీ జెనరల్ సెక్రటరీ సతీష్ చంద్ర మిశ్రాను పంపుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తనదైన సొంత హడావిడి చేస్తున్న కేసీఆర్‌కి ఆహ్వానం వచ్చినప్పటికీ.. హాజరయ్యే అవకాశాలు లేనట్లే. ఇంకా.. ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, హెచ్డీ కుమారస్వామి, చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, NCP చీఫ్ శరద్ పవార్, బీజేపీ అసమ్మతి నేతలు శత్రఘ్న సిన్హా, యస్వంత్ సిన్హా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

బెంగళూరులో గత మే నెలలో కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఇలాగే ర్యాలీ కట్టి.. ఐక్యతను చాటుకున్నాయి. కానీ.. అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ వేదికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. పెద్ద ఎత్తున జనసమీకరణ జరుపుతోంది. కానీ.. మమత ఆశిస్తున్నంత గొప్పగా ప్రతిపక్షాల ఐక్యత వర్ధిల్లబోదని విశ్లేషణలొస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *