ఎట్టకేలకు ఐపీఎస్ ఫైర్ బ్రాండ్ వీవీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలైంది. సొంత పార్టీ పెడతారని కొంతకాలం పాటు సాగదీసినా.. ఎన్నికల సీజన్ వచ్చేసరికి కొత్త క్లారిటీతో ముందుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరి భీమిలి నుంచి పోటీ చేస్తారన్న స్ట్రాంగ్ ఫీలర్లు మీడియాలో మెరిసినప్పటికీ.. మరుసటిరోజే.. జనసేనలో ప్రత్యక్షమయ్యారు. పవన్ కళ్యాణ్‌తో ఆలింగనం చేసుకున్నారు. అయితే.. ఈ ట్విస్ట్ వెనుక పెద్ద కుతంత్రం ఉందంటూ ఒక కథనం బైటికొచ్చింది.

చంద్రబాబే దగ్గరుండి పనిగట్టుకుని లక్ష్మీనారాయణను జనసేనలోకి సాగనంపారని, బాబుకు-పవన్‌కి మధ్య సయోధ్య కుదర్చడమే ఆయన డ్యూటీ అని మీడియాలో సోమవారమంతా హోరెత్తింది. టీడీపీ-జనసేన పొత్తు అంశం ఇప్పటికీ చర్చల్లో ఉందని.. జనసేన టీడీపీకి బీ-టీమ్ అని వైసీపీ మీడియా కూడా పాత పాటే పాడింది. తెలుగుదేశం పార్టీ కీలకంగా భావించే స్థానాల్లో జనసేనతో డమ్మీ క్యాండేట్లను పెట్టించడం ఈ డీల్‌లో భాగమట. అందుకు ప్రతిగా జనసేనకు కొన్ని సీట్లు ‘వదిలేసేలా’ చంద్రబాబు ప్లాన్ చేశారని, అందులో భాగంగానే భీమిలి, గాజువాక లాంటి కొన్ని సెగ్మెంట్లను టీడీపీ సోమవారం రాత్రి వరకూ పెండింగ్‌లో పెట్టిందని చెప్పుకున్నారు.

దక్షిణకోస్తా, రాయలసీమలో టీడీపీకి గ్యారంటీ సీట్లుగా భావించే కొన్ని సీట్లలో డైరెక్ట్‌గా బరిలో ఉండకుండా.. ఆయా సీట్లను కామ్రేడ్లకు, బీఎస్పీకీ పంచిపెట్టినట్లు జనసేన మీద వైసీపీ ఇప్పటికీ అభియోగం మోపుతోంది. ఈ సర్దుబాట్లన్నీ చంద్రబాబు మార్గదర్శకాల మేరకు లక్ష్మీనారాయణ దగ్గరుండి పవన్ కళ్యాణ్‌తో చేయించారని ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు.. జనసేన, టీడీపీ తుది జాబితాల మీద భూతద్దాలు పెట్టిమరీ రంధ్రాన్వేషణ చేస్తోంది వైసీపీ. బాబుతో లోపాయకారీ ఒప్పందం ద్వారా జనసేన కనీసం పాతిక సీట్లు గెలవగలగడం.. కాలం కలిసొస్తే.. కర్ణాటకలో కుమారస్వామి తరహాలో ఏపీలో కూడా చక్రం తిప్పించడం ఈ రెండు పార్టీల స్ట్రాటజీ అని రాసుకొచ్చింది.

వీవీ లక్ష్మీనారాయణకి విశాఖపట్నం ఎంపీ సీటు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. తాను రెండు చోట్ల పోటీ చేస్తూ.. చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేశారు. ఈ లెక్కన వైసీపీ అల్లిన కథనంలో నిజమెంత..? లేక.. ఎప్పట్నుంచో వైసీపీ మీడియా ఆడుతున్న మైండ్ గేమ్‌లో ఇదీ ఒక భాగమేనా? ఇంత చేసి.. ఇంకా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సరెండర్ అవుతారా? చాటుమాటు రాజకీయాల్ని పవన్ ఎంటర్టైన్ చేస్తారా? వీళ్లందరి ఆటలో తాను ఒక పావులా మారడానికి లక్ష్మీనారాయణ లాంటి నిఖార్సయిన అధికారి అంగీకరిస్తారా? అనే బరువైన ప్రశ్నలకు వైసీపీ మీడియా దగ్గర సమాధానాలు లేవు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *