మోదీని విమానమెక్కించారు.. మధును చంపేశారు..!

”విలాసవంతమైన జీవితం అనుభవించడానికి.. వ్యాపారాల పేరుతో ప్రభుత్వాల్ని మోసం చేయడానికి 12 వేల కోట్ల సొమ్ము దొంగిలించినవాడు.. విదేశాల్లో భద్రంగా బతికున్నాడు..! కడుపు తరుక్కుపోయేలా ఆకలేస్తుంటే కేవలం 200 రూపాయల చోరీకి పాల్పడ్డ ఒక నిరుపేద మనిషిని నడిరోడ్లో కొట్టి చంపేశారు..” ఇదెక్కడి న్యాయం..? అంటూ ఆక్రోశిస్తోంది సభ్య సమాజం. ఒకవైపు నిరవ్ మోదీ అనే దేశముదురు.. మరోవైపు మధు అనే కేరళ కుర్రాడు..! వీళ్లిద్దరికీ వేరువేరు న్యాయాలు ఎందుకు అమలు చేస్తున్నారు.. అంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ నిలదీస్తున్నారు మన వ్యవస్థల్ని. వివరాల్లోకెళితే..!

వంద శాతం అక్షరాస్యత నమోదైన.. అపర మేధావులతో కూడిన.. సామ్యవాద పార్టీ రాజ్యమేలుతున్న కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక ఘటన ఇది! పాలక్కాడ్ జిల్లా అట్టప్పడి ప్రాంతంలో మధు అనే పాతికేళ్ల ఒక ట్రైబల్ కుర్రాడు. సైలెంట్ వ్యాలీ పక్కనున్న నేషనల్ పార్క్ ఆవరణలో ఒక కిరాణా దుకాణంలో బియ్యం పప్పు దొంగిలించాడట. ఈ ‘దోపిడీ’ నిజమో అబద్ధమో తేలకముందే అక్కడున్నవాళ్లంతా గుమిగూడి అతడ్ని పట్టుకుని చితకబాదారు. చొక్కా విప్పి నడుంకి కట్టి.. చేతులు విరిచికట్టి.. చిత్ర హింసలు పెట్టారు.. ఇలా కొడుతుండగానే ఈ ఘనకార్యానికి పాల్పడుతున్నది మేమే అంటూ బాధితుడితో కలిసి సెల్ఫీ కూడా దిగారు కొందరు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని.. అప్పటికే సగం చచ్చిన అతడిని వెంట పెట్టుకుని స్టేషన్ కు వెళ్లబోతుంటే.. జీపులోనే నెత్తుటి వాంతులు చేసుకుని చచ్చిపోయాడు ఆ అభాగ్యుడు. ఇదీ జరిగిన దారుణం. కానీ.. చనిపోయేముందు అతడి నుంచి ‘విజయవంతంగా’ వాంగ్మూలం తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పది మందిని అరెస్ట్ చేశారు. ”నడిరోడ్లో కొట్టి చంపాల్సిన అవసరం ఆ జనానికి ఎందుకొచ్చింది.. అసలు అంతటి తప్పు అతడేం చేశాడని అలా రియాక్ట్ అయ్యారు..?” అంటూ ఇప్పుడు సివిక్ సొసైటీ నిలదీస్తోంది. మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్లు సైతం.. ”అతడ్ని చూస్తుంటే నా తమ్ముడిలా అనిపిస్తున్నాడు.. అకారణంగా చంపేశారు కదరా”? అంటూ ఆవేదనగా ట్వీట్ చేశాడు. ఇటువంటి దేహశుద్ధి ‘కార్యక్రమాలు’ తరచూ జరిగేవే అయినా.. ఈ ఘటన మాత్రం కేరళ రాష్ట్రం మొత్తాన్నీ కదిలించింది.