మూకదాడులు..! ఒక్కరిని పట్టుకుని పదులకొద్దీ జనం బహిరంగంగా కొట్టి చంపడం..! ఇండియాలో ఇటీవల చోటుచేసుకుంటున్న ఒక సాధారణ అంశం. గతంలో ‘మతకల్లోలాలు’ అంటూ ఒక బరువైన పేరుతో పిలువబడి, అతిపెద్ద నేరంగా పరిగణించే ‘వర్గ హింస’నే ఇప్పుడు లించింగ్ (మూకదాడులు) అంటూ ఒక తేలిక మాటతో సరిపెడ్తున్నామా? అవిశ్వాసం, అభద్రత కారణంగా కొన్ని వర్గాల్లో పుట్టిన అసహనం కారణంగానే ఈ మూకదాడులు సంభవిస్తున్నాయా..? అనే సునిశితమైన ప్రశ్నలతో కూడిన పుస్తకమే ‘లించ్ ఫైల్స్’..!

‘ఫ్రంట్ లైన్’ పత్రిక అసోసియేట్ ఎడిటర్ జియా ఉస్ సలాం రాసిన ‘లించ్ ఫైల్స్’ పుస్తకం.. మూకదాడులతో జరిగిన, జరుగుతున్న ఒక సామాజిక విధ్వంసాన్ని కళ్ళకి కట్టింది. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు, బాబ్రీ మసీదు కూల్చినప్పుడు జరిగిన కమ్యూనల్ వయొలెన్స్ ఘటనలు దేశ చరిత్ర మీద నల్లచారికల్నిఏర్పరిచాయి. కొన్ని శతాబ్దాల పాటు భారత జాతి మర్చిపోలేనంత తీవ్రతను సంతరించుకున్నాయి. కానీ.. ఇప్పుడు దేశంలో పరిపాటిగా మారిన ‘మూకదాడులు’ నాటి కమ్యూనల్ వయొలెన్స్ కంటే భయంకరమైనవని, ప్రభుత్వాలు తెలివిగా వీటి తీవ్రతను తగ్గించి చూపి సమాజాన్ని మోసపుచ్చుతున్నాయని రచయిత వాపోతున్నారు.

ఒక మతస్తుడి ఐడెంటిటీని బట్టి మరో మతస్థులు దాడికి పాల్పడ్డం, నడిరోడ్డుపై చంపడం అనేది గతంలో ఎప్పుడూ దేశం చవిచూడలేదన్నది ఆయన పేర్కొన్న మరో వాస్తవం. కేరళ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్ని మినహాయిస్తే.. మిగతా దేశంలో ఎక్కడైనా ముస్లిం సమాజం బిక్కచచ్చిపోయి బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ముస్లిం అనగానే గొడ్డుమాంసం తినేవాడన్న ఏకైక దృష్టితో చూడ్డం మొదలైందని ఆయన చెబుతున్నారు. లంచ్ బాక్సుల్ని సర్దడం దగ్గరనుంచి, తమ పిల్లలకు పేర్లు పెట్టడం దాకా ముస్లిం కుటుంబాల్లో ప్రతిదీ సమస్యగా మారిందట.

దేశంలో మొట్టమొదటి లించింగ్ ఘటన చోటుచేసుకున్న దాద్రి (ఉత్తరప్రదేశ్) గ్రామంలోని కొందరు ప్రత్యక్ష సాక్షుల కథనాల్ని సైతం తన పుస్తకంలో ప్రస్తావించారు. మతవాద శక్తులు పెట్రేగిపోవడం, వీళ్ళందరికీ కేవలం ఒక్క మతం మాత్రమే టార్గెట్ కావడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం..  ఈ ఒరవడిని అప్పుడు కమ్యూనల్ వయొలెన్స్ ఉదంతాల్లో చూశాం.. ఇప్పుడు లించింగ్ శకంలోనూ చూస్తున్నాం..! ఇదీ ‘లించ్ ఫైల్స్’ పుస్తకంలో వర్గహింసకీ-మూకదాడులకీ రచయిత చూపుతున్న సారూప్యత.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *