సతీ సమేతంగా మహారాష్ట్ర సీఎం 'పాడుతా.. తీయగా..'!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇప్పుడొక విచిత్రమైన వివాదంలో చిక్కుకున్నారు. ‘సేవ్ రివర్స్’ కాన్సెప్ట్ మీద రిలీజైన ఒక వీడియో సందేశంలో ఆయన తన భార్య అమృత ఫడ్నవిస్ తో కలిసి పాల్గొనడంపై వివాదం చెలరేగింది. పోయిషర్, దహిసార్, ఓషివారా, మితి.. ముంబై పరీవాహక ప్రాంతంలోని ఈ నాలుగు నదులను కాపాడుకుందాం.. అంటూ టీ-సిరీస్ రూపొందించిన ఈ వీడియోలో సీఎం సతీసమేతంగా ఆడుతూ, పాడుతూ కనిపించారు. వీళ్ళతోపాటు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి, ముంబై మున్సిపల్, పోలీస్ కమిషర్లు కూడా ‘కలర్ ఫుల్’ పొజిషన్స్ లో తళుక్కున మెరిశారు. ప్లేబాక్ సింగర్ సోను నిగమ్ పర్యవేక్షణలో ఈ ‘ముంబై నదీ గీతం’ షూటింగ్ జరిగింది. కానీ.. సీఎం.. తన భార్య అమృత సింగింగ్ స్కిల్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని వాడుకున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మెత్తి పోస్తోంది. ఏదేమైనా.. ఒక ముఖ్యమంత్రి సతీసమేతంగా అభినయించిన ఈ వీడియో మరాఠీ టీవీ చానెల్స్ లోను, మరాఠీ సినిమా థియేటర్స్ లోనూ హల్చల్ సృష్టిస్తోంది.