ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపిన అంశాల్లో ఒకటి..’పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం’. ఒక పార్టీ అధ్యక్షుడు బరిలో నిలిచే సెగ్మెంట్ ఏదై ఉంటుందన్న క్యూరియాసిటీ కలగడం సహజం. కొత్తగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతున్న పార్టీ కావడం, జైగాంటిక్ ఇమేజ్ కలిగిన లీడర్ కావడంతో ఈ ఆసక్తి రెట్టింపయింది. మొదటి రెండు జాబితాల్లో పవన్ పేరు లేకపోవడంతో.. మిగతా పార్టీలతో పాటు జనసైనికులు కూడా ఉస్సూరుమన్నారు. చివరికి మంగళవారం అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది.

భీమవరం, గాజువాక.. ఈ రెండూ పవన్‌కి కాబోయే జంట అడ్డాలు.. అంటూ జనసేన సగర్వంగా ప్రకటించుకుంది. ఒకటి గోదావరి బెల్ట్ నుంచి, మరొకటి ఉత్తరాంధ్ర నుంచి పిక్ చేసుకున్నారు పవన్. దక్షిణ కోస్తాను వదిలెయ్యడం ఊహించిందే అయినప్పటికీ.. రాయలసీమ విషయంలో పవన్ ఎందుకు ఉదాసీనత వహించారో ఆయనకే తెలియాలి. ఇదిలా ఉంటే.. ‘వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే మొట్టమొదటి ముఖ్యమంత్రి అభ్యర్థి’ అంటూ పవన్ కళ్యాణ్‌ని కోట్ చేస్తూ జనసేన సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేసింది.

”ఇదొక భారీ సైజు అప్పుతచ్చు.. సరిచూసుకోండి..” అంటూ వెంటనే సెటైర్ల పరంపర షురూ అయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి 1994లోనే ఎన్టీయార్ పోటీ చేసి గెలిచారన్న వాస్తవాన్ని ప్రస్తావిస్తూ.. జనసేన ట్విట్టర్లో ట్రోలింగ్ జోరందుకుంది. ట్వీట్ తీసేయ్యాలంటూ సిఫార్సులు కూడా వస్తున్నాయి. ఇటు.. గాజువాకను అత్యంత వెనుకబడి నియోజకవర్గంగా పేర్కొనడాన్ని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జనసేన సోషల్ మీడియా వింగ్ ‘శతఘ్ని’ ఇలా తప్పు చేసి నాలిక్కర్చుకోవడం గతంలో కూడా అనేకసార్లు జరిగింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *