వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న మాటని నిజం చేస్తూ బెంగాల్‌లో దూసుకుపోతోంది బీజేపీ. కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీకి ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడానొక్కుతూ స్కెచ్చులు గీసుకుంటున్నారు బెంగాల్ బీజేపీయులు. ఇన్నాళ్లూ ఆమె వెంటే ఉంటూ ఆమెకు బాసటగా నిలబడ్డ శాల్తీలని తమ వైపునకు తిప్పుకుని, దీదీని నైతికంగా దెబ్బతీసే బీజేపీ ఎత్తుగడల్లో మరొకటి.. భారతీ ఘోష్.

మాజీ ఐపీఎస్ అధికారిణి భారతీ ఘోష్.. ఒకప్పుడు సీఎం మమతా బెనర్జీకి బాగా దగ్గరగా మెలిగేవారు. బెంగాల్ సాయుధ దళాల మూడవ బెటాలియన్‌కి కమాండెంట్‌గా చేస్తూ.. గత ఏడాది జనవరిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. మమతకు వీరాభిమానిగా చెప్పుకుంటూ అనేక సభల్లో ఎమోషనల్ స్పీచ్ కూడా ఇచ్చింది. కట్ చేస్తే.. ఇప్పుడామె కేరాఫ్ కమలం పార్టీ. బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, కైలాష్ విజయ్ వర్గియా సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకుంది భారతీ ఘోష్.

సహజంగానే, పార్టీ మారిన మరునిమిషంలోనే బెంగాల్ సీఐడీ భారతీ ఘోష్ మీద నిఘా షురూ చేసింది. డ్యూటీలో ఉండగా ఆమె చేసిన అపరాధాల కోసం వెతకడం మొదలైంది. కానీ.. ‘బెంగాల్ కిరణ్ బేడీ’గా పిలిపించుకునే ఈ గట్టి పిండం.. ఏమాత్రం బెదిరిపోయే ప్రసక్తే లేదంటోంది. తాజాగా సీబీఐతో జగడం పెట్టుకున్న మమతా బెనర్జీ మీద పదునైన విమర్శలు చేస్తూ బెంగాల్ సర్కార్‌ని కార్నర్ చేస్తోందామె. శారదా చిట్స్ కుంభకోణం నుంచి తప్పించుకునేందుకే మమతా బెనర్జీ ‘దీక్ష’ పేరుతో డ్రామాలాడుతోందన్నది భారతీ ఘోష్ అభియోగం. బెంగాల్‌లో మమత దూకుడుకు చెక్ చెప్పడానికి మా దగ్గరా ఒక ఫైర్ బ్రాండ్ ఉందంటూ బీజేపీ సంబరపడుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *