సిరియాలో నరమేధం..బాంబుల వర్షంలో బాల్యం

కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్న సిరియాలో మళ్ళీ నరమేధం మొదలైంది. అధ్యక్షుడు బషర్ అల్-అసాద్ నేతృత్వంలోని ప్రభుత్వ సైనికులకు, తిరుగుబాటుదళాలకు మధ్య పోరు ఉధృతమైంది.

రెబెల్స్ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అసాద్ ప్రయత్నిస్తుండగా, అసాద్ పాలనకు చరమగీతం పాడేందుకు తిరుగుబాటు తీవ్రవాదులు రసాయనిక దాడులకు సైతం తెగబడుతున్నారు. సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలోని గౌటా నగరం ఈ దాడులకు వణికి పోతోంది.

గత రెండు వారాల్లో దాదాపు 4 లక్షల మంది ప్రజలు ప్రాణాలరచేతపట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 500 మందికి పైగా మరణించగా, సుమారు 150 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు. 8 ఏళ్ళ అంతర్యుద్ధం చిన్నారుల పాలిట ఊచకోతగా మారుతోంది.

ఆస్పత్రులు క్షతగాత్రులతో నిండి పోతుండగా, సరైన ఆహారం, వైద్య సౌకర్యం లేక అమాయక ప్రజలు తల్లడిల్లుతున్నారు. బాంబు దాడులతో నేలమట్ట మైన భవనాలు, శిథిల గృహాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి కాల్పుల విరమణ హెచ్చరికలను కూడా ఖాతరు చేయని అసాద్ తన ” రక్త పిపాస ” ను చాటుకుంటున్నాడు.