హిమాలయ ప్రాంతాల్లోని లక్షలాది ప్రజలకు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరత తప్పదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మైగ్రేషన్, పట్టణీకరణ పెరిగిపోవడం, టూరిజం, యాత్రికుల రద్దీ కూడా అధికం కావడం ఇందుకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు. వెంటనే ఈ ప్రాంతాల పరిధిలోనే దేశాల ప్రభుత్వాలు దీర్ఘ కాలిక చర్యలు తీసుకోని   పక్షంలో పెను ముప్పు అనివార్యమని హెచ్చరిస్తున్నారు. నేహభర్తి (ఇండియా), తన్వీర్ హసన్ (బంగ్లాదేశ్),మసూమా హసన్ (పాకిస్తాన్), శ్రేయాషీ సింగ్ (నేపాల్) తదితర పర్యావరణవేత్తలతో కూడిన బృందం ఈ మేరకు తమ అధ్యయనాన్ని  ‘ వాటర్ పాలసీ ‘ అన్న పుస్తకంలో ప్రచురించింది.
హిమాలయ పరిసరాల్లో పలు ఆసియా దేశాల ప్రజలు నివసిస్తున్నారు. ఇండియాతో బాటు ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, చైనా, పాకిస్తాన్, మయన్మార్, ప్రజల ఆవాసాలు ఇక్కడ ఉన్నాయి. 40 లక్షలకు పైగా చదరపు కి.మీ. విస్తీర్ణంలోగల హిమాలయాల్లో 240 మిలియన్ల మంది ఉంటున్నట్టు అంచనా. ఇక్కడ 10 మేజర్ రివర్ బేసిన్లు, 36 గ్లోబల్ బయో డైవర్సిటీ హాట్ స్పాట్స్‌కు ఇవి పెట్టింది పేరు. అయితే పొలోమంటూ పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుండడం వల్ల, వర్షాభావం వల్ల, అర్బనైజేషన్ వంటి వివిధ కారణాలతో ఇక్కడి భూగర్భజలాలు తరిగిపోతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా గత ఏడాది సిమ్లాలో తీవ్రమైన నీటికొరత ఏర్పడడం పరిస్థితికి అద్దం పడుతోంది అని ఈ బృందం పేర్కొంది. ముఖ్యంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్రభుత్వాలు దీనిపై తక్షణమే కార్యాచరణ చేపడితే కొంతలో కొంతయినా ప్రయోజనం ఉంటుంది అని వీరు సిఫారసు చేశారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *