తెలంగాణ ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫోన్లతో వెళ్లిన కొంతమంది ఓట్లు వేయకుండా వెనుదిరిగిపోయారు. పోలింగ్ బూత్ లలోకి ఫోన్లు ఉంటే అనుమతించడంలేదు. పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్లను దాచి పెట్టేందుకు సౌకర్యం లేకపోవడం.. ఎవరూ తెలిసిన వాళ్లు లేకపోవడంతో కొందరు ఓటర్లు తిరిగి ఇళ్లకి వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని ఎన్నికల అధికారులు ముందుగా ప్రకటించినప్పటికీ దీనికి తగినంత ప్రచారం జరక్కపోవడంతో చాలా మంది మొబైల్ ఫోన్లతోనే పోలింగ్ బూత్ లకు వచ్చారు. కొంతమంది తెలిసిన వాళ్లకి లేదా, ఫ్యామిలీ మెంబర్స్ కు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకోగా, కొంతమంది ఓటు వేయకుండానే వెనుదిరగడం విశేషం. కనీసం పోలింగ్ కేంద్రాల ముందు ఫోన్ల డిపాజిట్ చేసి వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచక పోవడంతో వారు ఓటేసేందుకు వచ్చి అవస్థలు పడ్డారు.

తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ శుక్రవారం మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్ నిజాం హైస్కూల్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఓటు హక్కుని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని, నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని తర్వాత బాధపడితే ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు.

 

కాగా, ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు ఉదయమే ఆమె పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అక్కడ జాబితాలో తన పేరు కన్పించకపోవడంతో ట్విటర్‌ వేదికగా జ్వాలా అసహనాన్ని వెళ్లగక్కారు. ‘ఆన్‌లైన్‌లో చెక్‌ చేసినప్పుడు నా పేరు ఉంది. ఓటర్ల జాబితాలో పేరు కన్పించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా జాబితాలో ఓటర్ల పేర్లు లేనప్పుడు ఎన్నికలు ఎలా పారదర్శకంగా జరుగుతాయి’ అని జ్వాలా ట్వీట్‌లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ ఎంపీ కె.కవిత నిజామాబాద్‌లో ఓటువేశారు. పోతంగల్‌లోని 177వ నెంబర్ బూత్‌లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కవిత ఓటర్లతో కలిసి క్యూలైన్‌లో నుంచొని, తన వంతు కోసం వేచిచూడటం పలువురిని ఆకట్టుకుంది.

ఇలాఉంటే, కొంతకాలంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మోత్కుపల్లి పోటీచేస్తున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *