‘నరేంద్ర మోదీ’ బయోపిక్.. ఎన్నికల వేళ సందడి చేస్తోంది. కష్టించి పని చేసే ఒక అపర సన్యాసి.. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి కుర్చీనెక్కేదాకా చేసిన జర్నీనే తెరకెక్కించామంటూ డైరెక్టర్ ఒమంగ్ కుమార్ చెప్పుకున్నాడు. బాక్సింగ్ మహిళా తేజం మేరీ కోమ్ జీవిత చరిత్రపై బయోపిక్ తీసిన అద్భుతమైన దర్శకుడితడు. కానీ.. ఈయన తీసిన నరేంద్ర మోదీ బయోపిక్ మాత్రం ఒక ‘అబద్ధాల పుట్ట’ అనేది దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న ఫస్ట్ టాక్. నాజీ జర్మనీ శకంలో ‘లెని రీఫెన్‌స్టల్’ అనే డైరెక్టర్ తీసే ప్రాపగాండా సినిమాల్ని గుర్తుకు తెస్తోందంటూ ఈ సినిమా మీద విసుర్లు పడ్తున్నాయి.

2014లో అఖండ విజయం దక్కించుకోవడం వెనుక మోదీ చేసిన హుందా రాజకీయ ప్రయాణానికి తమ సినిమా ప్రతిబింబం అంటూ ట్రైలర్ సినాప్సిస్ చెబుతోంది. అయితే.. ఇందులో పాకిస్తాన్ మీద జరిగిన మెరుపు దాడుల్ని ఎందుకు చూపించారన్నది మొదటి ప్రశ్న. ఈ మూవీలో గుజరాత్ అల్లర్ల ఎపిసోడ్‌ని చూపించిన విధానం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందని విశ్లేషణలొస్తున్నాయి. అహ్మదాబాద్, వడోదర మంటల్లో భగ్గుమంటున్నప్పుడు మోదీ గుండె పగిలేంతగా ఆవేదన చెందినట్లు పిక్చరైజ్ చేశారు. అల్లర్లలో చిక్కుకున్న పిల్లల్ని తానే స్వయంగా కాపాడినట్లు కూడా చూపించారు. నిజానికి.. విధ్వంసం జరుగుతున్న సమయంలో నాటి ముఖ్యమంత్రి మోదీ.. నీరో చక్రవర్తిలా పట్టీపట్టనట్లు వ్యవహరించారని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్టే అభిశంసించింది.

గుజరాత్‌లోని ప్రతి పౌరుడూ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే దాకా విశ్రమించబోననే మోదీ డైలాగులు సినిమాలో కృత్రిమంగా అనిపించాయి. అల్లర్లు జరగడానికి ముందురోజు జరిగిన సమావేశంలో ‘ప్రతి ముస్లిం మతస్తుడికీ గుణపాఠం నేర్పాలి’ అంటూ పోలీసధికారులకు మోదీ ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు దగ్గర అఫిడవిట్ వుంది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం అనంతర పరిణామాల్లో మోదీ వ్యవహార శైలి మీద దేశవ్యాప్తంగా విమర్శలొచ్చిన మాట వాస్తవం. కానీ.. గుజరాత్ అల్లర్ల నివారణకు మోదీ శాయశక్తులా ప్రయత్నించారన్నది ఈ బయోపిక్ సారాంశంలా తెలుస్తోంది. మోదీకున్న ఆరెస్సెస్ నేపథ్యాన్ని మాత్రం ట్రైలర్‌లో బలంగా చూపించారు. మొత్తమ్మీద.. ఎన్నికల ముందు మోదీని దేవుడుగా చూపించడమే ఈ సినిమా ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తోంది. లెజెండ్ స్టూడియోస్ బేనర్పై.. వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ చేస్తున్న మోదీ బయోపిక్ ఏప్రిల్ 5వ విడుదల కానుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *