వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. ఏపీ రాజకీయాల్లో ప్రధాన ‘వస్తువు’గా మారిపోయింది. సిట్ ఏర్పాటు చేశాం.. అసలు హంతకులు దొరికిపోతారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం టముకేస్తుంటే.. ‘మీ సిట్ మీద మాకు నమ్మకం లేదు..” అంటూ కేంద్ర వ్యవస్థల వైపు చూస్తోంది వైసీపీ శిబిరం. ఇదే డిమాండ్ కాగితాల్ని చేతబట్టుకుని గవర్నర్ దగ్గరికెళ్ళారు వైసీపీ అధినేత జగన్. వివేకా కూతురు సునీతా రెడ్డి కూడా ఇదే డిమాండ్‌తో మీడియా ముందుకొచ్చింది. మరోవైపు ‘సిట్’ దర్యాప్తు వేగవంతమైంది. ‘డొంక కదులుతోంది.. మరో 48 గంటల్లో దోషులు దొరుకుతారు’ అంటూ ఏపీ పోలీసులు భరోసానిస్తున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఎన్నికల ప్రచార సభల్లో ‘వివేకా హత్య’ను విరివిగా వాడుకుంటున్నారు. వైఎస్ కుటుంబం మీద సూటి విమర్శలు చేస్తూ జగన్‌ని కార్నర్ చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే.. వివేకా కూతురు మరో అడుగు ముందుకేసి.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘ముఖ్యమంత్రి మాటల ద్వారా మా నాన్న హత్య కేసు దర్యాప్తు ప్రభావితమవుతోంది.. ఆయన్ని కట్టడి చేయండి.. లేదా దర్యాప్తు సంస్థనైనా మార్చండి” అంటూ విజ్ఞప్తి చేసింది. ”ఈ కేసు దర్యాప్తు విషయంలో కలుగచేసుకునే అవకాశం లేదు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరండి” అంటూ తెగేసి చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది. దీంతో సునీతా రెడ్డి…ఢిల్లీ టూరేసి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ‘మా నాన్న హత్యలో మా బంధువుల్నే ఇరికించే ప్రయత్నం చేస్తోంది ఏపీ పోలీసు శాఖ..’ అంటూ వాపోయారామె.  అయితే.. ”ఇదేదీ మా పరిధిలో లేదు.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు చెప్పండి” అంటూ సీఈసీ కూడా కేవలం సలహాతో సరిపెట్టారు.

ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారన్న అభియోగంతో పులివెందుల సీఐని సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఆకస్మిక చర్యపై కూడా అనేక సందేహాలు పుట్టుకొస్తున్నాయి. సిట్ పోలీసుల అదుపులో ‘జగన్ సన్నిహితుడు’ వున్నాడన్న వార్తలు సైతం రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి. సరిగ్గా ఇదే గ్యాప్‌లో నామినేషన్ కోసం పులివెందులకొచ్చిన జగన్.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ”నన్ను కూడా అరెస్ట్ చేసే ఆలోచనలో వున్నారు. మీరే కాపాడుకోవాలి” అంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్.. సానుభూతిని కురిపించడమేమో గాని, వివేకా హత్య కేసు తీవ్రతను తెలియజేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *