తెలుగు ‘మూవీ ఆర్టిస్టుల సంఘం’ ఎప్పటికప్పుడు రంజుగా మారుతోంది. ఎన్నికల సమయంలో ప్యానళ్ల మధ్య ఎలాగూ కుమ్ములాటలు తప్పవు. మీడియాకెక్కి వాళ్ళు చేసే రొచ్చునంతా లైవ్‌లో చూసి ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. అవి కాస్తా ముగిసిపోయి.. ఎన్నికలు అయిపోయి.. ఇప్పుడు కొత్త ప్యానల్ ఎన్నికైంది. శివాజీరాజా కూటమిని ఓడగొట్టి.. పవర్లోకొచ్చింది నరేశ్ కూటమి. శుక్రవారం కొత్త కార్యవర్గం ప్రమాణస్వీకారం జరిగింది. అక్కడ కూడా బోలెడన్ని మసాలా సీన్లు కనిపించాయి.

కొత్త ప్రెసిడెంట్ నరేష్‌కి ఏకంగా మూడు ఝలక్‌లు తగిలాయి. ”ఎలక్షన్ తేదీకి ముందు సభ్యులందరికీ నరేష్ మందు కొట్టించాడు. ఇది నిజమో కాదో రాజశేఖర్‌తో చెప్పించండి” అంటూ ఓడిపోయిన శివాజీరాజా బాహాటంగా అడిగేసరికి.. కొత్త ఫ్యానల్ సిగ్గుతో బిగుసుకుపోయింది. ఇదిలా ఉంటే.. నరేష్ ఒంటెత్తు పోకడలు పోతున్నాడని, ప్రతిదానికీ ‘నేను నేను’ అంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని, కార్యవర్గం అంతా కలిసి చేస్తేనే ఏదైనా పని జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జీవితా రాజశేఖర్ వేదిక మీదే చీవాట్లు పెట్టేశారు.

మరోవైపు.. వైస్ ప్రెసిడెంట్ హేమ ప్రెసిడెంట్ నరేష్ మీద ఓపెన్‌గానే అలక పూనింది. ‘ఈ శుభ తరుణంలో సభ్యులందరికీ కొన్ని వరాలు ప్రకటిస్తున్నాను’ అంటూ సభ్యత్వ రుసుము తగ్గింపు, గోల్డ్ కార్డు లాంటివి నరేష్ అనౌన్స్ చేసినప్పుడు.. హేమ అభ్యంతరం తెలిపింది. ”ప్యానల్ మీటింగ్‌లో చర్చించిన తర్వాతే ఏవైనా నిర్ణయాలు ప్రకటించాలి. ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పద్దతి కాదు’ అనేసింది హేమ. పైగా.. తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారంటూ గొడవకు దిగింది కూడా. మొత్తమ్మీద ‘మా’లో ఒకటి కాదు.. నాలుగైదు ముసలాలు పుట్టేశాయి. ఒకరి కింద ఒకరు గొయ్యి తవ్వుకుంటూనే ఈ రెండేళ్ళూ గడిపేస్తారేమో!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *