నలుగురి నోళ్ళలో నానడానికి, ఆవిధంగా పేజ్3 కమ్యూనిటీని ఆకట్టుకోడానికి ఫ్యాషన్ కంపెనీలు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఒరవడిలో కొన్ని తప్పటడుగులు పడ్డం.. వాటితో ఏర్పడే లీగల్ లిటిగేషన్లు మామూలే. ఈ ఏడాది ఫ్యాషన్ ప్రపంచంలో వివాదాలకు కొరతే లేదు. మొత్తం ఏడు బ్యూటీ బ్రాండ్స్ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువులై.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. మొత్తానికి 2018లో ఫ్యాషన్ న్యూస్ సర్కిల్స్‌ని ఏలిన టాప్6 ఫ్యాషన్ గడబిడల్ని ఒక్కసారి పరిశీలిస్తే..!

అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్.. సిల్లీగా ఒక టీషర్ట్ విషయంలో రచ్చకెక్కింది. ఇటీవల సంభవించిన హార్వీ తుపాను బాధితుల్ని పరామర్శించడానికి ఆమె మెక్సికో సరిహద్దుల్లోని పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఇందులో ఏమీ మతలబు లేదు. కానీ ఆమె వేసుకున్న జారా జాకెట్ ఆమెను చెడ్డదాన్ని చేసింది. జాకెట్ వెనుక భాగంలో ”I Really Don’t Care Do U?” అని పెద్దక్షరాలతో అచ్చయింది. ఎవడైతే నాకేంటి? అనే అర్థం వచ్చే ఈ మాటలు ఆమెకు అవసరమా అంటూ నెటిజన్లు విమర్శలు అందుకున్నారు. దేశ ప్రధమ పౌరురాలు అయివుండీ.. ఆమె ఇలా ‘డోంట్ కేర్’ లాంగ్వేజ్ ఎందుకు వాడారు..? పైగా తుపాను పీడితుల దగ్గరికొచ్చి ఈ వేషాలేంటి? అంటూ ఆమెనొక దెయ్యంలా చిత్రీకరించింది మీడియా. ‘జస్ట్ ఇది జాకెట్ మాత్రమే కదా’ అంటూ మేడమ్ ట్రంప్ పర్సనల్ అసిస్టెంట్ కొట్టిపారేస్తున్నారు. మొత్తం గొడవకు కారణమైంది మాత్రం జారా కంపెనీ జాకెట్!


డాల్స్ అండ్ గబ్బన.. ఫేమస్ ఇటాలియన్ ఫ్యాషన్ కంపెనీ. ఈ నవంబర్లో చైనాలోని షాంగైలో ఒక ఈవెంట్‌కి వెళ్లాల్సి ఉంటే.. చివరినిమిషంలో టూర్ రద్దు చేసుకున్నారు. ఆ ఫ్యాషన్ కంపెనీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసిన ఒక వీడియో.. దీనికి కారణం. ఏషియన్ అమ్మాయి చాప్‌స్టిక్స్ సాయంతో ఇటాలియన్ ఫుడ్ తినడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపే ఆ వీడియో.. చైనా సంస్కృతిని భంగపరుస్తోందట. జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నారంటూ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వీబో’లో విమర్శల తాకిడి పెరిగింది. దీంతో జడుసుకున్న డాల్స్ అండ్ గబ్బన.. ‘ది గ్రేట్ షాంగై షో’కు వెళ్లకుండా ‘బతికిపోయారు’!


ఏటా ఇరగదీసే ‘విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షో’.. ఈసారి అట్టర్‌ప్లాప్ అయ్యింది. దాని పేరెంట్ కంపెనీ ‘ఎల్ బ్రాండ్స్’ ఎగ్జిక్యూటివ్..  షో గురించి ‘వోగ్’ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ చేసిన కామెంట్స్ వల్లే ఈ ‘దారుణం’ జరిగిందట. ’42 నిమిషాల పాటు ఎంటర్టైన్‌మెంట్ స్పెషల్‌గా ఈ షో నిర్వహిస్తున్నాం. దీన్ని రక్తి కట్టించడానికి ట్రాన్స్‌జెండర్‌ని, ప్లస్ సైజు మోడల్స్‌ని ఉపయోగించబోవడం’ లేదు అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడట. దీంతో ఆన్‌లైన్లో వీర లెవల్లో క్రిటిసిజం రావడంతో.. ఆ కంపెనీ ఫౌండర్ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో ఫుల్ పేజీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.


‘రివాల్వ్’ అనే గార్మెంట్స్ కంపెనీ ‘సన్నం-లావు’ మధ్య గొడవ పెట్టి వేడుక చూద్దామనుకుంది. తమ తయారీల్లోని ఒక స్వెట్టర్ మీద ‘Being fat is not beautiful it’s an excuse’ అనే మాటల్ని రాసి అగ్గిపుల్ల గీసేసింది. ‘లావాటి శరీరం అందవిహీనం. అదొక దురదృష్టం’ అనే ఈ స్లోగన్ ఊబకాయుల సమాజాన్ని టార్గెట్ చేసింది. టెస్ హాలిడే అనే ‘బాడీ-పాజిటివ్’ ఉద్యమకారిణి కోపం తెచ్చుకుని.. ‘చెత్త మనుషుల్లారా మీకేమైనా తిక్క పట్టిందా..?’ అంటూ ట్వీట్ చేసింది.


కాపీ కొట్టి బతకడం అనే చెడ్డలవాటు ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా చుట్టుముట్టేసింది. Bfyne అనే స్విమ్‌వేర్ బ్రాండ్.. దీని గురించే నెత్తీ నోరూ బాదుకుంటోంది. బ్రెజిల్‌కి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సిల్వియా ఉల్సన్.. తమ మోడల్స్‌ని కాపీ పేస్ట్ చేస్తోందన్నది వీళ్ళ అభియోగం. నైజీరియన్ కల్చర్ నుంచి స్ఫూర్తి పొంది తాము రూపొందించిన ఒక కలర్‌ఫుల్ స్విమ్ సూట్‌ని సిగ్గులేకుండా మక్కీకి మక్కీ కాపీకొట్టి.. దాన్ని తమ సొంత ఐడియా అంటూ డబ్బాలు కొట్టుకుంటోంది అంటూ Bfyne సంస్థ కోర్టుకెక్కింది.


‘బ్లాక్ ఫేస్’ సబ్జెక్టుకొస్తే ఫ్యాషన్ వరల్డ్‌కి గొప్ప ట్రాక్ రికార్డ్ ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ‘బ్లాక్‌ఫేస్ కాంట్రవర్సీ’ పుట్టుకొస్తూనే వుంది. ఒక్కో మోడల్‌ని రచ్చకీడుస్తూనే వుంది. ఇప్పుడు జిగి హడిడ్ అనే అమెరికన్ మోడల్ వంతొచ్చింది. వోగ్ ఇటాలియా మేగజైన్ కవర్ పేజ్ కోసం ఇచ్చిన ఫోజులో ఆమె ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ కలర్ మేకప్ వేసుకుందని, శరీరమంతా గ్రే కలర్ పూసుకుందని, ఇది బ్లాక్ మోడల్స్‌ని కించపర్చడమేనని విమర్శలొచ్చాయి. ఈ ఫోటో మీద రచ్చ పెద్దదయ్యేసరికి ఆమె సారీ చెప్పాల్సి వచ్చింది.


 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *