జగన్ రాసినవన్నీ.. అక్షర సత్యాలేనా?

వైసీపీ అధినేత జగన్ చాలాకాలం తర్వాత తొలిసారిగా పూర్తి డిఫెన్స్‌లో పడిపోయారు. ఆయనతో పాటు పార్టీ కేడర్‌ని కూడా ఒకలాంటి నిస్తేజంలో పడేశారు. నాన్న ఫార్ములాను నెత్తికెత్తుకుని పాదయాత్ర చేపట్టి విజయవంతంగా నడుస్తున్నానన్న విశ్వాసం నిన్నటిదాకా ఆయన ప్రతి అడుగులోనూ కనిపించింది. ప్రత్యేక హోదా పోరులో సైతం అధికార పార్టీ కంటే గట్టిగా నిలబడి పార్టీకి ఉత్తేజాన్ని తొడిగారు. ప్రతి శుక్రవారం కోర్టుకెళుతూ కేసుల్ని దీటుగా ఎదుర్కొంటున్న జగన్.. ఈ శుక్రవారం మాత్రం ఎప్పుడూ లేనంత అసహనానికి గురయ్యారు. ఈడీ రాడార్లో ఏకంగా భార్య పేరును చేర్చారన్న వార్తలు ఆయన అంతరంగాన్ని బాగా కెలికేసినట్లు.. ఆయన స్పందన చూస్తే తెలిసిపోతోంది.

‘నిందితుల జాబితాలో భారతి’ అనే మాటపై ఉదయాన్నే ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు జగన్. రాజకీయాల కోసం ఇంత నీచమైన స్థాయికి దిగజారతారా అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఇది పూర్తిగా దర్యాప్తు సంస్థలకు సంబంధించిన అంశం. అధికారిక ధ్రువీకరణకు ఎక్కడా అవకాశం ఉండదు. అందుకే.. ప్రధాన ముద్దాయి అయిన జగన్‌కి గానీ, భార్య భారతికి గానీ కనీస సమాచారం అందివుండక పోవచ్చు. కానీ.. ఇటువంటి వార్తలన్నీ మీడియాకు మాత్రమే ఎలా లీకవుతాయన్నది.. మీడియాతో దగ్గరి సంబంధమున్న జగన్‌కి బాగా తెలిసే ఉంటుంది. ఇదిలా ఉంచితే.. తన ఆవేదనను, ఆవేశాన్ని వెళ్లగక్కడానికి ఆ ఒక్క ట్వీట్ సరిపోలేదు జగన్‌కి. ఆ తర్వాత నింపాదిగా సాయంత్రం ఏకంగా మూడు పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు.

2011 ఆగస్టు 10న తన మీద ‘అక్రమ’ కేసుల దాడి షురూ అయిందని, ఇవ్వాళ్టికి సరిగ్గా ఏడేళ్లు గడిచిన సందర్భంలో.. ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా కోర్టుకు లాగే ప్రయత్నం జరుగుతోందని జగన్ ఎటాక్ మొదలుపెట్టేశారు. కేంద్రీయ దర్యాప్తు సంస్థల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈడీ విభాగంలో ఉమా శంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు అధికారులు చంద్రబాబు తొత్తులన్న జగన్.. వాళ్లలో గాంధీ అనే అధికారి బదిలీ అయినప్పటికీ మూడుసార్లు కంటిన్యుయేషన్ పొందారని రాసుకొచ్చారు. పగలు కాంగ్రెస్ పార్టీతో, రాత్రి బీజేపీతో చంద్రబాబు సాంగత్యం సాగుతోందంటూ జగన్ ఒక అసాధారణమైన అభియోగం మోపారు. ఇదే గనుక నిజమైతే.. చంద్రబాబు ‘చేతివాటం’ ఊహకందనంత గొప్పదన్న విషయాన్ని జగన్ అంగీకరించినట్లయింది.


రెండు తెలుగు పత్రికల్ని, వాటిలో వచ్చిన పతాక శీర్షికల్ని చదివిన జగన్.. ఎల్లో మీడియా అరాచకం అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం అసలు అంశాన్ని తేలిక చేసి చూపింది. నిజానికి.. జగన్ చెప్పిన రెండు పత్రికల్లోనే కాకుండా.. రెండు ప్రధాన ఆంగ్ల పత్రికల్లో సైతం ‘భారతి-ఈడీ’ వార్త మొదటిపేజీలో అచ్చయింది. ఈ విషయాన్ని జగన్ ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదు. ఇటు.. బీజేపీ-టీడీపీ పొత్తు అంశాన్ని ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం.. కొన్ని పాత విషయాల్ని గుర్తుచేశారు. ఎన్టీయార్ బయోపిక్ ప్రారంభ సమయంలో బాలయ్య-వెంకయ్య భుజంభుజం రాసుకు తిరిగారని, కేంద్ర మంత్రి భర్త బాబు కొలువులో కీలక పాత్ర పోషిస్తున్నారని, టీటీడీలో మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి సభ్యత్వం ఇచ్చారని.. ఈ లేఖలో ప్రస్తావించారు. ‘తెలుగుదేశం మాకిప్పటికీ మిత్రపక్షమే’ అంటూ లోక్‌సభలో హోమ్ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్‌ని కూడా పేర్కొన్న జగన్.. బీజేపీతో చంద్రబాబు అంటకాగుతున్నారన్న విషయాన్ని నొక్కివక్కాణించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసిన తెలుగుదేశం పార్టీకి.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయవచ్చన్న ఫీలర్లిస్తున్న చంద్రబాబుకు బీజేపీ ఏ లెక్కన సహకరిస్తుందన్న సరాసరి సందేహాన్ని మాత్రం జనానికే వదిలేశారు జగన్. తాను రాసిన మూడు పేజీల బహిరంగ లేఖ ద్వారా.. జగన్‌కి రాజకీయ ప్రయోజనం దక్కవచ్చేమో గాని.. భార్య పేరును ‘ఈడీ’కీడ్చారన్న తన ఆవేదనను తీరుస్తుందన్న నమ్మకమైతే లేదు.