ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ కొడతానంటూ తొడ గొట్టి సవాల్ చేసిన తెరాస అధినేత కేసీఆర్.. ఎలాగోలా ఆ పని పూర్తి చేసుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిపి అసెంబ్లీలో టీఆరెస్ బలం 100కి చేరింది. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస పెట్టుకున్న ‘స్వీట్ సిక్స్‌టీన్’ ఛాలెంజ్ మాత్రం కేసీఆర్‌ని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ‘కారు-సారు-పదహారు-ఢిల్లీ సర్కారు’ పేరుతో ఒక నినాదమే లేవనెత్తిన కేసీఆర్.. ఆ పదహారో సీటు (ఖమ్మం) కోసం చేస్తున్న కసరత్తు తిరగబడుతున్నట్లు తెలుస్తోంది.

2014లో తనకు చుక్కలు చూపించిన ఖమ్మం జిల్లా రాజకీయాల్ని.. తుమ్మల నాగేశ్వరరావు చేరికతో కొంత కంట్రోల్లోకి తెచ్చుకున్నారు కేసీఆర్. తర్వాత వైసీపీ ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుని ‘ఖమ్మం కూడా మాదే’ అనే ఫీలింగ్ ఏర్పరచగలిగారు. అయినా.. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో ఆశించినంత ఫలితం దక్కలేదు తెరాసకు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు రూమర్లు వచ్చాయి. గ్యారంటీ విన్నర్ అనుకున్న తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు.

వీళ్ళిద్దరితో లాభం లేదనుకుని.. మరో ఖమ్మం ఐకానిక్ లీడర్ నామా నాగేశ్వరరావు మీద కన్నేశారు. టీడీపీ హార్డ్‌కోర్ లీడర్‌గా పేరున్న నామా.. కొన్నాళ్ల నుంచి మొహం పక్కకు తిప్పుకున్నప్పటికీ.. ఇప్పుడు కేసీఆర్ వల్లో పడిపోయారు. కేటీఆర్ సమక్షంలో కండువా కూడా మార్చేసుకున్నారు. కార్పొరేట్ సెక్టార్లో కూడా బలమున్న నామాకు ఖమ్మం ఎంపీ సీటిచ్చి ‘గెలిపించుకోవచ్చన్నది’ కేసీఆర్ ప్లాన్. కానీ.. నామా చేరిక కార్యక్రమంలో తుమ్మల గైర్హాజరయ్యారు. జిల్లాలో వీళ్లిద్దరూ కలిసి పనిచేసుకునే వాతావరణం లేదని తేలిపోయింది.

ఇటు.. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తితో వున్నారని, అమిత్ షాతో టచ్‌లో వున్నారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణను లాగినట్లే, ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటిని ఎట్రాక్ట్ చేసి బలపడే యోచనలో వుందట బీజేపీ. ఈ లెక్కన.. ఖమ్మం ఎంపీ సీటు విషయంలో కేసీఆర్ ఒకడుగు ముందుకేస్తే.. పరిస్థితులు రెండడుగులు వెనక్కు నడుస్తున్నాయి. సో.. కేసీఆర్‌కి ఆ పదహారో సీటు దక్కడం అనేది ఆఖరిదాకా సస్పెన్సే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *