భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ(శుక్రవారం) సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ‘ప్రజా చైతన్య సభ’ పేరిట జరుగుతోన్న ఈ సభకు భారీబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విశాఖకు గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ తదితర ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దింపారు. బందోబస్తులో పాల్గొనే వారి సంఖ్యను 2,460కి పెంచారు. సభకు 50వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు.

షెడ్యూలు ప్రకారం ప్రధాని మోదీ సాయంత్రం 6.20 గంటలకు వైమానిక దళ ప్రత్యేక విమానంలో విశాఖలోని నౌకాదళ వాయుస్థావరం ఐ.ఎన్‌.ఎస్‌.డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వే మైదానానికి గం.6.45కి వస్తారు. 6.55 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభం అవుతుంది. 45 నిమిషాలపాటు.. అంటే రాత్రి 7.40 గంటల వరకు ప్రధాని ప్రసంగం కొనసాగుతుంది. తిరిగి 7.55 గంటలకు వేదిక నుంచి బయలుదేరుతారు.

ఈ దఫా ప్రధాని రాకకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంటుగా మారిన రైల్వేజోన్‌ను ప్రకటించడంతో భాజపా శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను తొలగించి దాని స్థానంలో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను మంజూరు చేయడాన్ని టీడీపీ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో టీడీపీ, వామపక్ష శ్రేణులు ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో నల్లచొక్కాలు, నల్లజెండాలతో నిరసన తెలిపాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉత్త చేతులతో ఆంధ్రప్రదేశ్‌కు రావడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ మోదీని చంద్రబాబు ప్రశ్నించారు. నెరవేర్చని హామీలపై ఐదు కోట్ల మంది ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *