అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం  నాసా ‘. ఆరేళ్లలో మొదటిసారిగా ఇన్-సైట్ స్పేస్ క్రాఫ్ట్ అరుణ గ్రహంపై దిగింది. 300 మిలియన్ మైళ్ళ బహుదూరం ప్రయాణించి శాస్త్రజ్ఞులను అమిత సంతోషంలో ముంచెత్తేలా చేసింది. అయితే ఇది సక్సెస్ అవుతుందా కాదా అని వాళ్ళంతా 7 నిముషాలపాటు తీవ్రమైన టెన్షన్ కి గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం ఇది సోమవారం తెల్లవారు జామున ఒకటిన్నర గంటల ప్రాంతంలో అంగారక గ్రహం పైకి అడుగు పెట్టింది.

ఇది విజయవంతం కావడంతో నాసా పరిశోధకులు సంతోషంతో ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ నౌకలోని రోబో నెమ్మదిగా ఈ గ్రహాన్ని తాకింది. 1960 నుంచి వివిధ నేషనల్ స్పేస్ ఏజన్సీలు తమ అంతరిక్ష నౌకలను ఈ గ్రహం పైకి పంపేందుకు 44 సార్లు ప్రయత్నాలు చేశాయి. అయితే నాసా ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా అక్కడ దిగడం విశేషం. మార్స్ పైన ‘ ఎలైసియం  ప్లనీషియా ‘ అని వ్యవహరించే చోట ఈ నౌక దిగిందని అంటూ నాసా ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే  అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్  తన ట్విటర్ లో నాసా పరిశోధకులను, సైంటిస్టులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

మీ అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో ఇదొక అద్భుతమైన మైలురాయి అని అభివర్ణించారు. మాజీ వ్యోమగాములు క్రిస్ హ్యాడ్ ఫీల్డ్, మార్క్ కెల్లీ, స్కాట్ కెల్లీ సైతం నాసా టీమ్ కి కంగ్రాట్స్ చెప్పారు.అటు-న్యూయార్క్ సిటీలో ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు.నస్దాక్ టవర్ వద్ద అతి పెద్ద టీవీ తెరపై లైవ్ గా ఈ దృశ్యాలను ప్రసారం చేశారు. మార్స్ పై అడుగుపెట్టిన ఈ అంతరరిక్ష నౌక..అక్కడ పరిశోధనలు జరిపి మానవ జీవనానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని నిర్ధారిస్తుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *