ఎప్పటిలాగే బెజవాడ రాజకీయం మళ్ళీ రసవత్తరంగా మారింది. తనడిగిన టిక్కెట్ నిరాకరించడంతో వైసీపీ నుంచి బైటికొచ్చి నిలబడ్డ వంగవీటి రాధ.. ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. జగన్‌కి రాజీనామా ఇచ్చేముందే ‘చేరబోయే పార్టీ’పై ఒక నిర్ణయానికొచ్చేసినప్పటికీ.. పరిస్థితులు ముందనుకున్నంత అనుకూలంగా లేవన్న క్లారిటీ ఆయనకు ఇప్పుడిప్పుడే కలుగుతోంది. మరో రెండురోజుల్లో భవిష్యత్ నిర్ణయం వెల్లడిస్తానన్న రాధా.. ఆ పనిలో బిజీగా వున్నారు.

జగన్ ఎటూ తేల్చకపోవడంతో 4 నెలల పాటు మౌనంగా ఉండాల్సి వచ్చిందంటున్న రాధా.. కార్యకర్తలు, అనుచరుల నుంచి ఒత్తిడి రావడంతో బైటికొచ్చేయాల్సి వచ్చిందన్నారు. కానీ.. తెలుగుదేశం నుంచి పిలుపు రావడంతోనే గబగబా రిజిగ్నేషన్ గీసి పడేశారట! కానీ.. తానడిగిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు లేదు. ఇప్పటికే బోండా ఉమ అక్కడ కర్చీఫ్ వేసి ఉంచారు. ఇప్పటికీ వంగవీటి రాధ కోసం.. బోండా ఉమను బుజ్జగిస్తూనే వుంది తెలుగుదేశం హైకమాండ్. 100 శాతం గ్యారంటీ లేదు గనుక.. పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్‌ని కూడా జేబులో పెట్టుకుని రెడీగా వున్నారు రాధ.

బెజవాడ కాపు ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో వంగవీటి రాధ సిద్ధహస్తుడు గనుక.. అతడికి పవన్ కళ్యాణ్ కరిష్మా కూడా తోడైతే గెలుపు ఖాయమని ఒక కాలిక్యులేషన్ బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో తిరుగుతోంది. జనసేనలో టిక్కెట్ల కోసం ఎలాగూ పోటీ లేదు గనుక ప్లాన్B బలంగా వున్నట్లే లెక్క. ఇదిలా ఉంటే.. వంగవీటి రాధా రాజీనామా వార్త విన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ కూడా ఆయనకు పచ్చ జెండా ఊపారు. మరో వారం రోజుల్లో దాదాపు కోటి మంది సభ్యత్వం పూర్తి చేసి బలిష్టంగా వున్న ప్రజాశాంతి పార్టీలోకి ఎవరొచ్చినా సంతోషం అన్నది పాల్ గారి ఆశాభావం. ఈ ఆఫ్‌బీట్ పార్టీని అటుంచితే.. వంగవీటి రాధా తీసుకోబోయే నిర్ణయం ఏపీ పొలిటికల్ ట్రెండ్‌ని కీలక మలుపు తిప్పడం ఖాయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *