నొప్పి నివారణకు వాడే పెయిన్ కిల్లర్స్ లో కొని డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) గా కూడా ‘ పని చేస్తున్నాయట ‘. ముఖ్యంగా నొప్పి త్వరగా తగ్గడానికి డాక్టర్లు కొన్ని పవర్ ఫుల్ పెయిన్ కిల్లర్స్ ని సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఇవి వాడేవారు వీటిలోని సెడేటివ్ గుణాల కారణంగా మత్తులోకి జారిపోతున్నారని వెల్లడైంది. అంటే… దాదాపు డ్రగ్స్ తీసుకున్నట్టే ! బ్రిటన్ లో ప్రతి 11 మంది రోగుల్లో ఒకరికో, ఇద్దరికో ఇలాంటి ప్రమాదకరమైన మందులు ఇస్తుంటారని, దీనితో వారు వాటికి బానిసలుగా మారిపోతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

ఈ ట్రెండ్ ని నివారించేందుకు కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రులకు, డాక్టర్లకు కొన్ని మార్గదర్శక సూత్రాలను నిర్దేశిస్తున్నారు. నిజానికి ఇలాంటి పెయిన్ కిల్లర్స్ ను వాడుతున్నవారి సంఖ్య 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 50 శాతం పెరిగిందని అంచనా. దీంతో రంగంలోకి దిగిన ఆరోగ్యశాఖ.. లండన్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్ లెన్స్ కి తగిన గైడ్ లైన్స్ ఇచ్చిందని గిలాన్ లెంగ్ అనే ప్రొఫెసర్ తెలిపారు.

కొంతమంది రోగులకు కొన్ని నెలలు, లేదా సంవత్సరాల పాటు పోస్ట్-ఆపరేటివ్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుందని, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోందని ఆయన చెప్పారు. వీరు త్వరగా కోలుకునేందుకు డాక్టర్లు అధిక మోతాదు పెయిన్ కిల్లర్స్ ను ప్రిస్ క్రైబ్ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ దేశంలో రోజుకు కనీసం ఇద్దరు, ముగ్గురైనా డ్రగ్స్ లాంటి ఈ ‘ కిల్లర్స్ ‘ ను వాడి మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే తాజాగా కొన్ని అత్యవసర రూల్స్ ని పాటించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించాలని ఎంపీలు సుమారు రెండేళ్లుగా చేస్తున్న ‘ పోరాటం ‘ ఫలించిందని లెంగ్ పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *