ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్

తెలుగు సినీ దిగ్గజం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రకు వెండితెర రూపం ‘ఎన్టీఆర్’. నందమూరి నటసింహం బాలకృష్ణ తండ్రిపాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. 1975 అంటే, 52ఏళ్ల వయసులో తన అభిమానుల్ని ఉద్దేశించి స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వహస్తాలతో రాసిన లెటర్ పొందుపరిచిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ యంగ్ లుక్ లో బాలకృష్ణ కనిపిస్తున్నారు.  తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతుండగా, తెలుగు చిత్రసీమకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో వివిధ పాత్రల్లో అలరించబోతున్నారు. యావత్ తెలుగు చిత్రసీమకే పండుగ వాతావరణాన్ని కల్పిస్తోన్న ఈ సినిమా ఇవాల్టి నుంచే షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9వ తేదీన సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నాడు, నేడు ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారమంటూ.. తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ బాలకృష్ణ, క్రిష్ పేరిట ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇలాఉండగా, మరికాసేపటికి ఫస్ట్ డే, ఫస్ట్ షాట్ అంటూ డైరెక్టర్ క్రిష్ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ సిపాయి గెటప్ లో ఉన్నకలర్ పోజుని రిలీజ్ చేశారు.