అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఓ అబద్ధాలకోరట ! అలా అని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో పని చేసిన రోనాల్డ్ క్లెయిన్ అనే అధికారి అంటున్నారు. భవిష్యత్తులో ఒక రోగి ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏ డాక్టర్ కూడా ముందే ఊహించి చెప్పలేడని ఆయన పేర్కొంటున్నారు. ఇది సాధ్యం కాదన్నది ఆయన వాదన. లోగడ ఆఫ్రికాలో తలెత్తిన ఎబోలా వ్యాధి అదుపునకు నాటి ఒబామా ప్రభుత్వం తీసుకున్న చర్యలను క్లెయిన్ పర్యవేక్షించారు. తాజాగా..ట్రంప్ డాక్టర్ ఒకరు ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించిన తీరును క్లెయిన్ తప్పు పట్టారు.

ట్రంప్ ఇటీవల మేరీల్యాండ్ లోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ ను విజిట్ చేసినప్పుడు..సీన్ కాన్లే అనే డాక్టర్ మరో 11 మంది స్పెషలిస్టులతో కలిసి ట్రంప్ కి మెడికల్ చెకప్ చేశారు. ట్రంప్ మంచి ఆరోగ్యంగా ఉన్నారని, తన అధ్యక్ష పదవీకాలంలోను, ఆ తరువాత కూడా ఆయన హెల్త్ ఇలాగే భేషుగ్గా ఉంటుందని కాన్లే పేర్కొన్నారు. పైగా ట్రంప్ కు ఎలాంటి ఎనస్తీషియా ఇవ్వలేదని, అసలా అవసరమే రాలేదని కూడా ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను అబద్దాలుగా క్లెయిన్ కొట్టిపారేశారు. ఏ డాక్టర్ కూడా భవిష్యత్తులో ఒకరి ఆరోగ్యం ఎలా ఉంటుందో జోస్యం చెప్పలేడని, ఇది ఇక్కడ అధ్యక్ష పదవికే అవమానమని ఆయన ట్వీట్ చేశాడు. తన అబద్ధాలకు ఒక డాక్టర్ తనను సాధనంగా వాడుకునేందుకు ప్రెసిడెంట్ అవకాశమివ్వడం ఒక జోక్ అని ఆయన అభివర్ణించారు.

గత ఏడాది రానీ జాక్సన్ అనే మరో డాక్టర్ కూడా ట్రంప్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన జీన్స్ కి ఎలాంటి ‘ ముప్పూ ‘ లేదని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించి నవ్వులపాలయ్యాడు. ‘ మరో 20 ఏళ్ళు మీరు బలవర్ధకమైన ఆహరం తింటే మరో 200 ఏళ్ళు జీవించడం ఖాయం ‘ అని కూడా ట్రంప్ ను ఉద్దేశించి ఆయన అన్నాడు. ట్రంప్ వైద్యులంతా ఇలా ‘ అబద్ధాల మీద ‘ బతికేస్తున్నారని క్లెయిన్ హేళన చేశాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *