ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకుని 2014లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకున్న బీజేపీ.. 2019లో ఒంటరి పక్షిగా మారి.. దిక్కులు చూస్తోంది. ఇప్పటికే నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేసి.. బాబు వైఖరిపై లోకల్ వార్ షురూ చేశారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరుతారన్న వార్తలొస్తున్నాయి.

ఇటీవల రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాంరాం చెప్పి.. 21న జనసేనలోకి జంప్ అవుతానంటూ కుండ బద్దలు కొట్టేశారు. కృష్ణాజిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాత్రం.. మొదటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగా మెలుగుతున్నారు. పొత్తు పెటాకులైనప్పటినుంచీ ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. బీజేపీలో మిగిలిన నాలుగో ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు..!

విశాఖ నార్త్ నుంచి గెలిచి.. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అనేకసార్లు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తి వార్తల్లో నిలిచారు కూడా.  తాజాగా ఈయన కూడా బీజేపీ మీద తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. ‘రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన విష్ణు.. ఈసారి కూడా తాను విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే.. ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న ప్రశ్నకు త్వరలో చెబుతానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. విష్ణుకుమార్ రాజు తెలుగుదేశంలో చేరుతారన్న రూమర్లు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *