తెలంగాణ పొలిటికల్ డ్రామాకి తెర పడిపోయింది. ఇక ఏపీ రాజకీయానికి వేళయింది. తెలుగుదేశం, వైసీపీ, జనసేనల మధ్య హోరాహోరీగా స్కెచ్చులు రెడీ అవుతున్నాయి. బీజేపీకి, జనసేనకు దూరమై ఒంటరి పార్టీగా మిగిలిన తెలుగుదేశాన్ని మరింత కార్నర్ చేయాలన్నది ప్రధాన ప్రతిక్షం వైసీపీ వ్యూహం. ఇందులో భాగమే.. ‘టార్గెట్ బాలయ్య’. చంద్రబాబుకు నందమూరి కుటుంబానికి మధ్య పొలిటికల్ లింకులు ఒక్కటొక్కటిగా తెగ్గొట్టడంలో ఇది రెండో అంకం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా బరిలో దిగింది నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆమె పోటీ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ.. సకల శక్తులూ ఒడ్డినా ఆమెను గెలిపించలేకపోయారు చంద్రబాబు. ఈ ఎపిసోడ్‌లో అధికార తెరాసకు వైసీపీ పరోక్షంగా సహకరించిందని వార్తలొచ్చాయి. కూకట్‌పల్లిలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడం తెరాసకు ఎంత అవసరమో, అక్కడ సుహాసిని ఓడిపోవడం వైసీపీకీ అంతే కీలకం. ఈ ప్రచ్ఛన్న యుద్ధం వల్లే కూకట్‌పల్లి టీడీపీ చేజారింది. ఇక్కడ చంద్రబాబుపై నైతిక విజయం సాధించిన వైసీపీ.. ఇప్పుడు ఏపీలో రెండో అంకానికి తెర లేపింది.

నందమూరి ఫ్యామిలీకి ట్రెడిషనల్ నియోజకవర్గం హిందూపూర్. 1985 నుంచి మూడుసార్లు ఎన్టీయార్‌ని, 96లో హరికృష్ణను అసెంబ్లీకి పంపిన చరిత్ర హిందూపూర్ సెగ్మెంట్‌ది! తర్వాత పదేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. 99 నుంచి వెంకటరాముడు, పామిశెట్టి రంగనాయకులు, పీ. అబ్దుల్ గనీ తెలుగుదేశం నుంచి గెలిచారు. 2014లో మళ్ళీ నందమూరి కుటుంబం ఎంట్రీ ఇచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ తన సీటును త్యాగం చేసి నందమూరి బాలకృష్ణను గెలిపించాడు. 2019లో కూడా హిందూపూర్ నుంచే పోటీచేయాలన్న ఉద్దేశంతో బాలయ్య శ్రమిస్తున్నారు. కానీ.. ఈ గ్యాప్‌లోనే హిందూపూర్ తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్!

బాలకృష్ణ కోసం సీటు వదులుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు అబ్దుల్ గనీ వైసీపీలో చేరిపోయాడు. టీడీపీలో 30 ఏళ్లుగా సర్వీస్ చేసినా తగిన ప్రాధాన్యత కల్పించలేదని, బాలకృష్ణ అడుగడుగునా అవమానిస్తున్నారని ఆరోపిస్తున్న అబ్దుల్ గనీ.. వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ నుంచి వైసీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ వుంది. ఈవిధంగా బాలకృష్ణను ఓడించి చంద్రబాబుకు, నందమూరి కుటుంబానికి వున్న ఆ కొద్ది రాజకీయ బంధానికి గండి కొట్టవచ్చన్నది జగన్ శిబిరం ప్రణాళిక. ఇప్పటికే ఎన్టీయార్ సతీమణి లక్ష్మిపార్వతి వైసీపీలో వున్నారు. ఎన్టీయార్ ఒరిజినల్ వారసుడిగా పేరున్న తారక్.. పార్టీతో ఆంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ లెక్కన.. నందమూరి-నారా ఫ్యామిలీ పాలిటిక్స్‌కి మధ్య కనెక్షన్ పూర్తిగా ‘కట్’ అయ్యే అవకాశం వుంది. తాజా ఆపరేషన్ పేరు ‘టార్గెట్ బాలయ్య’!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *